కొంతకాలంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు, అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడమే. ఓ వైపు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ ఎంతగానో పోరాడుతుంటే.. బన్నీ వెళ్లి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం జనసైనికులకు కోపం తెప్పించింది. అప్పటినుంచి అల్లు అర్జున్ పై పవన్ అభిమానులు దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో పవన్ ఘన విజయం సాధించడంతో పాటు, డిప్యూటీ సీఎం కావడంతో.. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో బన్నీ విషయాన్ని ఇప్పుడిప్పుడే వారు మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో అల్లు కాంపౌండ్ మరోసారి పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ ‘ఓజీ'(OG)పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఒక ఫ్యాన్ మేడ్ వీడియో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘బద్రినాథ్’ చిత్రంలోని ‘ఓంకారేశ్వరి’ సాంగ్ తో.. పవన్ కళ్యాణ్ పై స్పెషల్ వీడియోను రూపొందించాడు ఓ అభిమాని. లిరిక్స్ ని సింక్ చేస్తూ పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసిన ఈ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓ రకంగా సోషల్ మీడియాని షేక్ చేస్తోందని చెప్పవచ్చు. పవన్ అభిమానులు ఎంతో ఆనందంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో అల్లు కాంపౌండ్ ఊహించని పని చేసింది. అల్లు వారి నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కి చెందిన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ లో.. ‘బద్రినాథ్’లో ‘ఓంకారేశ్వరి’ సాంగ్ కి అల్లు అర్జున్ డ్యాన్స్ వేసిన వీడియో క్లిప్ ని షేర్ చేసింది. దీంతో కామెంట్ సెక్షన్ లో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. “ఇప్పుడు ఆ సాంగ్ మాది అని చెప్పడం కోసం.. ఈ వీడియో పోస్ట్ చేశారు కదా” అని విరుచుకుపడుతున్నారు. మరి అల్లు కాంపౌండ్ తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ.. పవన్ ఫ్యాన్స్ ని అనవసరంగా గెలికినట్లుగా అయింది.

కాగా ఏపీ ఎన్నికలకు ముందు రోజు కూడా వైఎస్ జగన్ కి మద్దతుగా రూపొందించిన ‘యాత్ర-2’ సినిమాని చూడండి అంటూ అల్లు ఓటీటీ వేదిక ఆహా అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్ట్ మాయమైంది. మరి ఇకనైనా సోషల్ హ్యాండిల్స్ విషయంలో అల్లు వారు జాగ్రత్తగా ఉంటారో లేక ఇలాగే ఉండి అనవసరమైన వివాదాలకు తెరదీస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here