సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో రూపాంతరాలు చెందింది. మూకీ నుంచి ఇప్పటి డిజిటల్ టెక్నాలజీ వరకు సినిమా రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అందుబాటులో వున్న టెక్నాలజీతో ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే డబ్బింగ్ విషయంలోనూ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది కన్నడ చిత్ర పరిశ్రమ. సాధారణంగా నటీనటుల వాయిస్ సినిమాకి అనుగుణంగా లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టులతో డైలాగులు చెప్పించడం మనం ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు సినిమా రంగంలోనే మొదటిసారి ఒక కుక్కతో డబ్బింగ్ చెప్పించారు.
కన్నడలో రూపొందుతున్న ‘నను మత్తు గుండా2’ అనే సినిమా కోసం ఈ ప్రయోగం చేసి విజయం సాధించింది చిత్ర యూనిట్. కుక్క డబ్బింగ్ చెప్పినప్పటి ఫోటోలను విడుదల చేయడం ద్వారా దర్శకుడు రఘుహాసన్ ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేశారు. 2020లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘నాను మత్తు గుండా’. దీనికి సీక్వెల్‌గా ‘నానుమత్తు గుండా2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ ఒక కుక్క చుట్టూనే తిరుగుతుంది. శంకర్ మరణం తర్వాత గుండా ప్రయాణం ఎలా సాగుతుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ల్యాబ్డర్ జాతికి చెందిన సింబా అనే కుక్కతో డబ్బింగ్ చెప్పించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకి ఆర్.పి. పట్నాయక్ సంగీతాన్ని అందిస్తున్నారు.