16 జూన్ 2024
తిరువనంతపురంలో హోటల్ రూమ్ తీసుకున్నాం. ఉదయం 7 గంటలకే అనంతపద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాము. సువిశాల ఆలయ అవరణ అత్యద్భుతంగా ఉంది. ఆ నిర్మాణ శైలిని, అక్కడ శిల్పసందను చూసి తీరాల్సిందే. దర్శనం అయ్యేటప్పటికి పదిన్నర దాటింది. తిరువనంతపురం సమీపంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు చూడటానికి ఒక ఆటో తీసుకున్నాం. పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని పలవనగాడు(పవనగడి) వినాయక ఆలయం సందర్శనతో మా ట్రిప్ మొదలైంది. ఈ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే తీరు విచిత్రంగా ఉంది. గోడ మీదకు బలంగా విసిరి కొడతారు. ఆ తర్వాత అట్టుక్కల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లాం. ఆ తర్వాత అక్కడ నుంచి పూవార్ ఐలాండ్ బోటింగ్ పాయింట్‌కి వెళ్లాం. రెండున్నర గంటల బోటింగ్‌కి, ఒక బోట్ కి మూడు వేల ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారు. కోకొనట్ ఐలాండ్, ఫ్లోటింగ్ రిసార్ట్స్, గొల్డెన్ బీచ్, కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని మేరిమాత విగ్రహం, షూటింగ్ స్పాట్ ఇలా కొన్ని ప్రాంతాలు కవర్ చేస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అనకొండతో పాటుగా కొన్ని హాలివుడ్ సినిమాలు ఈ ప్రాంతంలోనే షూట్ చేశారట. ఆ ప్రాంతాలను కూడా మనం చూడొచ్చు.