టూరిజం అభివృద్ధికి పెద్ద పీట
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బయటి దేశాల నుంచి బౌద్ధులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి నెలలో మంత్రులు, శాసన సభ్యులు ఒకరోజు ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. దీంతో పర్యాటకంపై ప్రచారం కలిగి, ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాల సందర్శనతో ఆలోచన విధానం మారుతుందన్నారు. బౌద్ధస్తూపం, భక్త రామదాసు ఇల్లు దగ్గర అభివృద్ధి పనులు, నీటి వనరుల్లో బోటింగ్, టాయిలెట్లు, హోటల్ తదితర ఏమేం పనులు చేపట్టాలో సమగ్ర నివేదిక పొందుపర్చి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలాగా అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి అన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలతో కలిసి భక్త రామదాసు గృహాన్ని సందర్శించారు. తెలుగు వాగ్గేయకార ఆద్యులు, భద్రాచల శ్రీ సీతారామ దేవస్థానం నిర్మించిన భక్త రామదాసు (కంచర్ల గోపన్న) నాలుగు శతాబ్దాల కిందట జీవించిన నేలకొండపల్లిలోని ఆయన స్వగృహాన్ని, పక్కనే నిర్మాణంలో ఉన్న నూతన ధ్యాన మందిరాన్ని వారు సందర్శించారు. భక్త రామదాసు వినియోగించిన బావిని పరిశీలించారు. అప్పటి విశేషాలను అర్చకులు, స్థానికుల ద్వారా తెలుసుకున్నారు.