భారతీయ నెమలిని పావో క్రిస్టాటస్ అంటారు. మగ నెమలి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీలం, ఆకుపచ్చ రంగు కలిసిన నెమలీకలతో ప్రతి ఒక్కరికి నచ్చే పక్షి ఇది. దీని అద్భుతమైన అందం, సాంస్కృతిక ప్రాముఖ్యత, తరిగిపోతున్న సంఖ్య… ఇవన్నీ కూడా భారతదేశ జాతీయ పక్షి హోదాను దానికి అందించింది. వన్యప్రాణులకు రక్షణ చట్టం ప్రకారం నెమలిని వేటాడడం, పట్టుకోవడం, వాటికి హాని చేయడం వంటివన్నీ కూడా నేరపూరిత చర్యలే. వీటి సహజ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. అలాంటిది ఒక యూట్యూబర్ కేవలం న్యూస్ కోసం నెమలిని చంపి కూరగా వండి తిన్నట్టు వీడియో చేశాడు. అయితే అతను తిన్నది నిజంగా నెమలి మాంసమో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.