తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, స‌త్య, తనికెళ్ళ భరణి, గౌతమి, సుదర్శన్ తదితరులు

సంగీతం: మిక్కీ జె. మేయర్

సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్‌

ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్‌

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

విడుదల తేదీ: ఆగష్టు 15, 2024 

‘మిరపకాయ్’ వంటి సూపర్ హిట్ తర్వాత మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఇది హిందీ మూవీ ‘రైడ్’కి రీమేక్. ఒరిజినల్ స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని, తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టుగా సినిమాని మలిచి, హిట్ కొట్టడం హరీష్ శంకర్ కి అలవాటు. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’కి కూడా అదే ఫాలో అయ్యాడని ప్రచార చిత్రాలతోనే క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ-హరీష్ కాంబో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Mr Bachchan Review)

కథ:

బచ్చన్(రవితేజ) ఒక సిన్సియర్ ఇన్ కమ్ టాక్స్ అధికారి. నిజాయితీనే ఆయుధంగా, ఎవరికీ భయపడకుండా వందల కోట్ల నల్ల ధనాన్ని వెలికితీస్తాడు. అలాంటి బచ్చన్ ఒకసారి ఓ పొగాకు వ్యాపారి ఇంటిపై రైడ్ చేసి.. భారీ మొత్తంలో డబ్బు, నగదు పట్టుకుంటాడు. అయితే ఆ వ్యాపారి తన పలుకుబడి ఉపయోగించి బచ్చన్ ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ సొంత ఊరికి వచ్చి, చిన్నతనం నుంచి తనకు అలవాటైన ఆర్కెస్ట్రా సింగర్ అవతారమెత్తుతాడు. ఈ క్రమంలో జెక్కీ(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అయితే, బచ్చన్ ఉద్యోగం పోయిందని, మొదట జెక్కీ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరు. ఇంతలోనే బచ్చన్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేశారని తెలియడంతో పెళ్లికి అంగీకరిస్తారు. ఒకవైపు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా.. పై అధికారుల నుండి బచ్చన్ కి ఒక టాస్క్ వస్తుంది. అదేంటంటే ఆ ప్రాంత ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంటిపై ఐటీ రైడ్స్ చేయాలి. ముత్యం జగ్గయ్య పేరు వింటేనే ఆ ప్రాంతంలో అందరూ భయపడతారు. సీఎంను సైతం లెక్కచేయని స్వభావం ముత్యం జగ్గయ్య ది. అంగ బలం, అర్థ బలం అన్నీ ఎక్కువే. ఎవరైనా తనకు ఎదురొస్తే ప్రాణాలు తీసేస్తాడు. అలాంటి ముత్యం జగ్గయ్య ఇంటిలోకి బచ్చన్ ఎలా ప్రవేశించాడు? ఐటీ రైడ్స్ చేయగలిగాడా? రైడ్స్ ని అడ్డుకోవడానికి ముత్యం జగ్గయ్య ఏం చేశాడు? అతని బలం, డబ్బు, అధికారం ముందు బచ్చన్ నిజాయితీ నిలబడిందా? తను ప్రేమించిన జెక్కీని బచ్చన్ పెళ్లి చేసుకున్నాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

రీమేక్ సినిమా అంటే కోర్ పాయింట్ మిస్ అవ్వకుండా ఇక్కడి ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టుగా మలచాలి. ఆ విషయంలో తాను దిట్ట అని గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలతో దర్శకుడు హరీష్ శంకర్ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మిస్టర్ బచ్చన్ విషయంలో హరీష్ లెక్క తప్పింది. ఇది హిందీ సినిమా రైడ్ కి రీమేక్. ఒక నిజాయితీ గల అధికారి, సీఎం స్థాయి పలుకుబడి ఉన్న బలమైన రాజకీయ నాయకుడి ఇంటిపై సోదాలు చేయడమంటే.. కథనం ఎంత పగడ్బందీగా రాసుకోవాలి. రైడ్స్ ను అడ్డుకోవడానికి విలన్ వేసే ఎత్తులు.. ఆ ఎత్తులను చిత్తు చేస్తూ రైడ్స్ చేయడానికి హీరో వేసే పైఎత్తులతో.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగించేలా చేయాలి. కానీ హరీష్ శంకర్ దీనిని ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మలిచి, ఎటువంటి థ్రిల్ లేకుండా చేశాడు.

సిన్సియర్ ఆఫీసర్ గా హీరో పాత్రను పరిచయం చేయడం, ఆ తర్వాత సస్పెండ్ అవ్వడం వంటి సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. కానీ కాసేపటికే గాడి తప్పుతుంది. హీరో విలేజ్ కి వెళ్లి ఆర్కెస్ట్రాలో పాటలు పాడటం, హీరోయిన్ వెంట పడటం వంటి సీన్స్ రొటీన్ గా ఉన్నాయి. కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. చాలా సీన్స్ మిరపకాయ్, గద్దలకొండ గణేష్ సినిమాలను గుర్తు చేస్తాయి. లవ్ ట్రాక్, కామెడీ సీన్స్, సాంగ్స్ తో.. ఎటువంటి మెరుపులు లేకుండానే చాలా రొటీన్ గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ కి పది నిమిషాల ముందే అసలు కథ మొదలవుతుంది. హీరో అండ్ టీమ్, ఐటీ రైడ్స్ చేయడం కోసం విలన్ ఇంట్లోకి ప్రవేశించడంతో.. సెకండ్ హాఫ్ అయినా ఆసక్తికరంగా నడుస్తుందని ప్రేక్షకులు ఇంటర్వెల్ లో భావిస్తారు. కానీ ఆ అభిప్రాయం తప్పని, సెకండాఫ్ మొదలైన కాసేపటికే అర్థమవుతుంది. హీరో, విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులతో రైడ్స్ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా నడవాలి. కానీ చూసే ఆడియెన్స్ కి నీరసం కలుగుతుంది. ఏ దశలోనూ హీరోని ఛాలెంజ్ చేసేలా, ఇరుకున పెట్టేలా విలన్ పాత్ర ఉండదు. విలన్ పాత్రను చాలా పవర్ ఫుల్ అన్నట్టుగా పరిచయం చేస్తారు. కానీ సన్నివేశాల్లో, కథనంలో ఆ పవర్ కనిపించదు. దానికితోడు ఎంతో థ్రిల్లింగ్ గా జరగాల్సిన రైడ్స్ లో కామెడీ ట్రాక్ లు ఇరికించారు. పోనీ అవైనా నవ్విస్తాయా అంటే అదీ లేదు. ఫన్, థ్రిల్ రెండూ మిస్ అయ్యాయి. ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ ఏంటనేది ముందే ప్రేక్షకులకు అర్థమవుతుంది. కాబట్టి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు కూర్చోబెట్టడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. కానీ ఈ విషయంలో హరీష్ శంకర్ దారుణంగా నిరాశ పరిచాడు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన అందం, అభినయంతో మెప్పించింది. ముత్యం జగ్గయ్యగా జగపతిబాబు మరోసారి రెచ్చిపోయాడు. తన నటనతో ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రైటింగ్ వీక్ గా ఉండటంతో సత్య కామెడీ తేలిపోయింది. సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

రీమేక్ వాసన రాకూడదనే భావనతో మసాలాలు మరీ ఎక్కువగా దట్టించి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మిస్టర్ బచ్చన్ ను మలిచాడు దర్శకుడు హరీష్ శంకర్. రైడ్ కథకి ఆయన చేరిన మార్పులు ఏమాత్రం మెప్పించలేదు. స్క్రిప్ట్ మీద కంటే హీరోయిన్ ని అందంగా చూపించడం పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపించింది. కథకుడిగా హరీష్ పూర్తిగా నిరాశపరిచాడు. సంభాషణల్లో మాత్రం ఆయన మార్క్ బాగానే కనిపించింది. అయితే కొన్ని చోట్ల అనసరమైన ద్వందార్థ పదాలతో తన స్థాయిని తగ్గించుకున్నట్టుగా ఉంది. మిక్కీ జె. మేయర్ సంగీతం బాగానే ఉంది. సినిమాలో పాటలు, వాటి పిక్చరైజేషనే కొంతవరకు రిలీఫ్. ఆయనంక బోస్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా…

ఇదొక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. హీరోయిన్ అందాలు, నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏంలేదు.

రేటింగ్: 2.25/5

– గంగసాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here