తాజాగా ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు సినిమాకి, మరీ ముఖ్యంగా ‘సీతారామం’ (Sita Ramam) సినిమాకి అన్యాయం జరిగింది. 2022 కి గాను తాజాగా అనౌన్స్ చేసిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ఒక్క అవార్డు కూడా రాలేదు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు విభాగంలో ‘కార్తికేయ-2’ కి అవార్డు వచ్చినప్పటికీ అందులో ఎటువంటి ప్రత్యేకత లేదు. ఎందుకంటే తమిళ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషలకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఆయా భాషలకు చెందిన ఏదో ఒక సినిమాని ఎంపిక చేస్తారు. ‘కార్తికేయ-2’ కూడా అలాగే ఎంపికైంది. కాబట్టి, జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి అవార్డు రానట్టే లెక్క. (70th national film awards)

2022 లో తెలుగులో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి బ్యూటిఫుల్ మూవీ విడుదలైంది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్‌, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో కథా కథనాలు కట్టిపడేశాయి. నటన, దర్శకత్వం, సంగీతం, కెమెరా, ఆర్ట్ ఇలా అన్ని విభాగాలు అద్భుత ప్రతిభను కనబరిచాయి. అయినప్పటికీ ఒక్క విభాగంలో కూడా ‘సీతారామం’కి అవార్డు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘సీతారామం’ వంటి క్లాసిక్ ఫిల్మ్ కి ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడం ఏంటని మండిపడుతున్నారు.

నిజానికి 2022 లోనే ‘ఆర్ఆర్ఆర్’ కూడా విడుదలైంది. కానీ 2021 డిసెంబర్ 31 కి ముందే సెన్సార్ పూర్తి కావడంతో.. 2021 ఏడాదికి గాను ప్రకటించిన అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. దీంతో ఇక 2022కి గాను తెలుగు సినిమాల్లో ‘సీతారామం’ సత్తా చాటుతుందని భావించారంతా. కానీ అనూహ్యంగా ఒక్క అవార్డు కూడా రాలేదు. ‘సీతారామం’తో పాటు ‘మేజర్’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలు కూడా 2022 లోనే విడుదలయ్యాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here