ప్రస్తుతం మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన అంశాల్లో వేణుస్వామి వివాదం ఒకటి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల వ్యక్తిగత జాతకాలను మీడియా వేదికగా బహిర్గతం చేయడం అనే అంశం మీద వేణుస్వామిని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అంతేకాదు, సినీ ప్రముఖులు, ఫిలిం జర్నలిస్టులు మహిళా కమిషన్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్‌ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. అంతే కాదు, తాజాగా మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌. ఇలా సర్వత్రా వేణుస్వామిపై వ్యతిరేకత ఉంది. అయినా తన ఉనికిని కాపాడుకునేందుకు, తను ఎలాంటి తప్పు చెయ్యలేదని సమర్థించుకునేందుకు వేణుస్వామి ప్రయత్నిస్తున్నారు. ఇతని విషయంలో సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ నటి, రాజకీయ నేత మాధవీలత వేణుస్వామి వ్యవహారంపై స్పందించారు. 

‘జాతకం అనేది వ్యక్తిగత విషయం. దాన్ని పబ్లిక్‌లో పెట్టి అందరి దృష్టికీ తీసుకురావడం అనేది కరెక్ట్‌ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి జాతకం చెప్పించుకోవడానికి వెళ్లినపుడు కొన్ని విషయాలను కుటుంబ సభ్యుల సమక్షంలోనే చెబుతారు. కొన్ని విషయాలు మాత్రం కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించి ఆ వ్యక్తికి మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకం మరో వ్యక్తికి తెలియకూడదు. అలాంటిది ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఒక జంట ఇంకా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టక ముందే వాళ్ళు విడిపోతారని చెప్పడం చాలా దుర్మార్గం. వ్యక్తిగతంగా నేను ఈ జాతకాలు నమ్మను. అయితే 2007లో నా ఫ్రెండ్‌ ఒక జ్యోతిష్యుడ్ని నా దగ్గరకి పంపించింది. నాకు ఇంట్రెస్ట్‌ లేదని చెప్పినా అతను చెప్తానన్నాడు. సరే చెప్పమన్నాను. మీకు లవ్‌స్టోరీ ఉందని చెప్పాడు. అవునని అన్నాను. ఇది నిలబడదమ్మా.. కొన్నాళ్ళకు పోతుంది అని చెప్పారు. దానికి నేను ‘జాతకాల వల్ల మనుషులు విడిపోతారా లేక వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ కంటే కూడా అండర్‌స్టాండిరగ్‌ బాగుంటే కలిసుంటారా’ అని అడిగాను. దానికాయన ‘అలా చెప్పాలంటే మనిషి సంకల్పమే గొప్పది’ అన్నాడు. నిజం కూడా అదే. ఒక జోతిష్యుడు నువ్వు గొప్పవాడివి అయిపోతావు అని చెప్తాడు. అది విని ఏమీ చెయ్యకుండా ఖాళీగా కూర్చుంటే అయిపోడు. అతను చెప్పిన దాన్ని పాజిటివ్‌గా తీసుకొని కష్టపడాలి, లక్ష్య సాధనకు కృషి చేయాలి. అప్పుడే గొప్పవాడు అవుతాడు. అంతే తప్ప జోతిష్యుడు చెప్పింది జరుగుతుంది అని కాలయాపన చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. 

ఇందులోనే మరికొందరు జోతిష్యులు ఉన్నారు. మనుషుల బలహీనతలతో ఆడుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయి నాకు మెసేజ్‌ పెట్టింది. వాళ్ళ ఊళ్ళో ఒక జోతిష్యుడు ఆమెను బెదిరిస్తున్నాడట. నీ భర్తతో విడిపోతావు. నువ్వు గనక ఈ పూజ చేస్తే కలిసి ఉంటావు. లేకపోతే నీకు కష్టాలు తప్పవు అని చెప్తున్నాడట. ఇది ఎంతవరకు కరెక్ట్‌. అతని దగ్గర విద్య ఉంటే ఉండొచ్చు. దానితో మనుషుల్ని బెదిరించడం ఏమిటి. అసలు జాతకాలు అనేది వేదాల్లో లేవు. గ్రహాల్ని బేస్‌ చేసుకునే జాతకాలు చెబుతారు. వాళ్ళు మనకు చెడు జరుగుతుంది అని చెబితే అలా జరగకుండా మన నడవడిక మార్చుకొని ముందుకెళ్లాలి. అంతే తప్ప పూజలు చెయ్యడం వల్ల అవి ఆగిపోవు. ఇలా మనుషుల బలహీనతలతో ఆడుకోవడం అనేది కరెక్ట్‌ కాదు’ అంటూ జాతకాలపై, వేణుస్వామిపై తన అభిప్రాయాన్ని తెలిపారు మాధవీలత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here