మెగాస్టార్‌ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయ వాఖ్యాలు అక్కర్లేదు. ఈరోజు చిన్న పిల్లవాడిని అడిగినా ఆయన గురించి చెబుతాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్‌ హీరోలు తమ ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకుంటున్నారు. అయినా  ఇప్పటి ప్రేక్షకులు కూడా చిరంజీవిని అభిమానించడం విశేషంగా చెప్పుకోవాలి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అన్ని వయసుల వారు అభిమానించే అందరివాడు చిరంజీవి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన మెగాస్టార్‌ కేవలం స్వయంకృషితో తెలుగువారు గర్వించే స్థాయి హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి మెగాస్టార్‌ వరకు ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి నటుడూ చిరంజీవిలా పేరు తెచ్చుకోవాలని కలలు కంటాడు. ఆయన సినీ ప్రస్థానం అందర్నీ అంతలా ప్రభావితం చేసింది.

తెలుగు సినిమా ఒక మూస ధోరణిలో వెళ్తున్న సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరు డాన్సుల్లో, ఫైట్స్‌లో చూపించిన వైవిధ్యం అందర్నీ ఆకట్టుకుంది. ఆరోజుల్లో డాన్స్‌ అంటే మొదటగా చిరంజీవి పేరే వినిపించేది. తను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించే విధంగా కథలను ఎంపిక చేసుకుంటూ అంచెంలంచెలుగా తన ఇమేజనను పెంచుకుంటూ వచ్చారు చిరు. ఆయన కెరీర్‌లో సాధించిన సంచలన విజయాలు అనేకం. కలెక్షన్ల పరంగా అప్పటివరకు ఉన్న రికార్డులను అధిగమించి కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. 150కి పైగా సినిమాల్లో తన నటనతో అలరించిన చిరంజీవి తన ఎదుగుదలకు కారణమైన ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మరచిపోలేదు. వారి కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్‌ 22. ఈ సందర్భంగా చిరు కెరీర్‌లో సాధించిన రికార్డులు, చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న అమితాబ్‌ బచ్చన్‌ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. ఒక సినిమాకి రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ది వీక్‌ మ్యాగజైన్‌ కవర్‌ స్టోరీగా ప్రచురించింది. 90వ దశకంలో ఆయన చేసిన సినిమాలన్నిటికీ ఇదే పారితోషికం తీసుకున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుకకు ఆహ్వానించబడిన తొలి సౌత్‌ హీరోగా నిలిచారు చిరు. ఇక కలెక్షన్లపరంగా ఘరానామొగుడు చిత్రంతో రూ.10 కోట్ల షేర్‌, ఇంద్ర చిత్రంతో రూ.30 కోట్ల షేర్‌  సాధించిన తొలి తెలుగు హీరోగా మెగాస్టార్‌ రికార్డు సృష్టించారు. అలాగే బాహబలి రికార్డు తర్వాత కలెక్షన్ల పరంగా ఖైదీ నంబర్‌ 150తో నాన్‌ బాహుబలి రికార్డును సాధించిన తొలి హీరో చిరు. ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసి ఆ ఘనత సాధించింది. గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు, ఘరానామొగుడు.. ఈ మూడు సినిమాలూ బ్లాక్‌బస్టర్సే. ఇలాంటి మూడు వరస విజయాలతో కొత్త రికార్డును క్రియేట్‌ చేసిన ఘనత కూడా మెగాస్టార్‌దే. ఇక ఇండస్ట్రీ హిట్స్‌ విషయానికి వస్తే.. 5 ఇండస్ట్రీ హిట్స్‌ సాధించిన ఏకైక టాలీవుడ్‌ హీరో చిరంజీవి. ఈ రికార్డు ఇప్పటికీ మెగాస్టార్‌ పేరు మీదే ఉంది. దాన్ని ఇప్పటివరకు ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు. పారితోషికం విషయంలో అమితాబ్‌ని క్రాస్‌ చేయడమే కాదు, ఆ తర్వాతి రోజుల్లో ఆమిర్‌ఖాన్‌ను కూడా మించిపోయారు చిరు. లగాన్‌ చిత్రానికిగాను ఆమిర్‌ రూ.6 కోట్లు తీసుకుంటే, దాన్ని అధిగమించి చిరంజీవి రూ.7 కోట్లు అందుకున్నారు. అంతేకాదు, టాలీవుడ్‌ హీరోల్లో ఎక్కువ ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్న హీరో కూడా చిరంజీవే. ఆయన కెరీర్‌లో 7 ఫిలింఫేర్‌ అవార్డులను సాధించారు. 

ఇక మెగాస్టార్‌ చిరంజీవి చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే.. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడమే కాదు, ఎంతో మంది కళ్ళల్లో వెలుగును నింపిన మంచి మనిషి చిరంజీవి. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమందికి రక్తదానం, నేత్ర దానం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కోవిడ్‌ సమయంలో ఎంతో మంది ఆపన్నులకు నేనున్నానంటూ అభయ హస్తాన్ని అందించారు చిరు. సరైన సమయంలో ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులను చూసి చలించిపోయిన చిరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశారు. లాక్‌డౌన్‌ వల్ల చిన్నాభిన్నమైన కొందరి జీవితాల్లో ఆశలను చిగురింపజేశారు. ముఖ్యంగా సినీ కార్మికుల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాల అందించారు. ఇక సినిమాల్లో ఒక వెలుగు వెలిగి చివరి దశలో దీనావస్థకు చేరుకున్న ఎంతో మంది కళాకారులకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయాన్ని అందించారు. తన దృష్టికి వచ్చిన ఎందరో అభాగ్యులకు చేయూతనిచ్చారు. ఇవి మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లోని కొన్ని విశేషాలు మాత్రమే. 

చిరంజీవి గత ఏడాది వాల్తేరు వీరయ్యగా వీర విహారం చేశారు. ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర చేస్తున్నారు. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కాబోతోంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యమిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్‌ 22న. ఈ సందర్భంగా నిత్యకృషీవలుడు, అన్ని వయసుల వారూ అన్నయ్యా అని పిలుచుకునే అందరివాడు మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here