భారీ బడ్జెట్‌ సినిమాలకు, హై టెక్నికల్‌ వేల్యూస్‌ మూవీస్‌కి పెట్టింది పేరు శంకర్‌. జెంటిల్‌మెన్‌ నుంచి భారతీయుడు 2 వరకు అన్నీ హై బడ్జెట్‌ సినిమాలే చేశారు శంకర్‌. అతను ఇచ్చే ఔట్‌పుట్‌ ఆ రేంజ్‌లోనే ఉంటుంది కాబట్టి నిర్మాతలు కూడా ఎంత బడ్జెట్‌ పెట్టడానికైనా వెనుకాడేవారు కాదు. కానీ, రాను రాను శంకర్‌కి అది ఒక అలవాటుగా మారిందో ఏమోగానీ, అవసరం ఉన్నా లేకపోయినా బడ్జెట్‌ను తగ్గించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో అనవసరంగా నిర్మాతతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడా అనే డౌట్‌ నిర్మాతలకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా కలుగుతోంది. ఇది భారతీయుడు 2 విషయంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఇదే విషయం గురించి నటుడు, దర్శకుడు ఎస్‌.జె.సూర్య ఒక తమిళ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్‌పై సెటైర్లు వేశారు. వాస్తవానికి అతను చేసిన కామెంట్స్‌లో పొగడ్త కనిపించినా అంతర్లీనంగా అంత బడ్జెట్‌ అవసరమా అనే ప్రశ్న కూడా ధ్వనించింది. 

భారతీయుడు2లో సూర్య చేసిన క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యం ఉన్నట్టు అనిపించదు. సినిమాలో అతను కనిపించే సీన్లు కూడా చాలా తక్కువ. అయినా ఆ సీన్ల కోసం ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ఒంటి నిండా బంగారంతో ఓ ఖరీదైన భవనంలో ఉంటాడు సూర్య. ఆ కాస్ట్‌లీ హౌస్‌ గురించి సూర్య చెబుతూ ‘ఆ సెట్‌ని రూ.8 కోట్లు ఖర్చు పెట్టి వేశారు. వాస్తవానికి దాని కోసం అంత బడ్జెట్‌ పెట్టడం అవసరం లేదని నా ఉద్దేశం. ఇదొక్కటే కాదు, సినిమాలో ఇలాంటివి మరో 20 సెట్లు ఉన్నాయి. అంత భారీ సెట్స్‌ను మేనేజ్‌ చెయ్యడం చాలా కష్టం. అయినా ఈ విషయంలో శంకర్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు’ అంటూ వివరించారు. సూర్య చెప్పిన దాన్ని బట్టి ఆ 20 సెట్లకు కనీసం రూ.160 కోట్లు అయి ఉంటుంది. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది. భారతీయుడు చిత్రంతో తమ హీరోకి భారీ విజయాన్ని అందించిన శంకర్‌.. భారతీయుడు2 చిత్రాన్ని డిజాస్టర్‌గా నిలబెట్టడం కమల్‌హాసన్‌ ఫ్యాన్స్‌కి రుచించలేదు. అందుకే సూర్య ఇంటర్వ్యూ చూసిన తర్వాత డైరెక్టర్‌ శంకర్‌ను ట్రోల్‌ చెయ్యడం మొదలుపెట్టారు. సూర్య చెప్పిన సెట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఎందుకూ పనికి రాని సెట్‌ అది. దానికి అంత ఖర్చు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సూర్య ఇంటర్వ్యూ చూసిన తర్వాత దిల్‌రాజును గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు నెటిజన్లు. కమల్‌ హాసన్‌ సినిమాకే శంకర్‌ అంత ఖర్చుపెట్టించాడంటే గేమ్‌ఛేంజర్‌కి ఎంత బడ్జెట్‌ పెట్టించాడో అని మెగా ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. భారతీయుడు2 నేర్పిన గుణపాఠంతో శంకర్‌ తన తప్పు తెలుసుకొని గేమ్‌ఛేంజర్‌ని సూపర్‌హిట్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చరణ్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here