ఒక సినిమా విజయంలో రచయితల పాత్ర ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ సినిమాకైనా కథే హీరో అంటారు. అలాంటి కీలక పాత్ర పోషించే రచయితలు దోపిడీకి గురవుతున్నారన్నది ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ అభిప్రాయం. అందుకే వారి కోసం ఒక గుడ్‌ న్యూస్‌ తీసుకొచ్చారు. ఒక సినిమా విజయం సాధించిన తర్వాత థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే ఆదాయం కోసం గత 2012లో రచయితల కాపీరైట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని అమలులో పెట్టేందుకు 12 సంవత్సరాలుగా కృషి జరుగుతోంది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చడంలో విజయేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. అసలు కాపీరైట్‌ చట్టం ద్వారా రచయితలకు ఎలాంటి మేలు జరుగుతుంది, దాన్ని అమలులోకి తీసుకు రావడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు అనే విషయాలను ఇటీవల ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్‌ వివరించారు. 

‘మొదట నేను రాజ్యసభ సభ్యుడిగా ఎలా ఎన్నికయ్యాను అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. 2022 జూలై 6న పురంధేశ్వరిగారు మా ఆఫీస్‌కి ఫోన్‌ చేసి నా నెంబర్‌ అడిగారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి పి.ఎల్‌.సంతోష్‌ నాకు కాల్‌ చేసి మీకో బాధ్యత అప్పజెబుతాం అన్నారు. అలాగే టైమ్‌ టు టైమ్‌ 50 రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పారు. నేను ఓకే సార్‌ అన్నాను. 7వ తేదీన ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మోడీగారు మాట్లాడతారు అని చెప్పారు. నేను చాలా నెర్వస్‌ ఫీల్‌ అయ్యాను. అప్పుడు మోడీగారు లైన్‌లోకి వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు. నాకు హిందీ రాదు. అంతకుముందు కరోనా వల్ల నా చెవులు, మాట ఎఫెక్ట్‌ అయ్యాయి. ఆయన మాటల్లో రాజ్యసభ అనే మాట మాత్రం వినిపించింది. అయితే ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్‌ చేసుకోలేదు. ఎందుకంటే అది నిజం కాకపోతే నవ్వులపాలవుతాం అనిపించింది. ఆ తర్వాత నన్ను కంగ్రాట్యులేట్‌ చేస్తూ మెసేజ్‌లు రావడంతో ఇది  ప్రాంక్‌ కాదు, నిజమే అని నమ్మాను. 

ఆగస్ట్‌లో మోడీగారిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పేందుకు పర్మిషన్‌ అడిగాను. ఆయన రమ్మన్నారు. రెండు, మూడు నిమిషాలు మాట్లాడదామని వెళ్లాను. కానీ, 43 నిమిషాల పాటు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో ఆయనకి గ్రాండ్‌ విజన్‌ ఉంది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ‘నేను ఏం చెయ్యాలి సార్‌?’ అని అడిగాను. ‘మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్తున్నారు. డు ఇట్‌. అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు’ అన్నారు. కానీ, నా మనసు అంతటితో ఆగలేదు. ఏదో చెయ్యాలన్న తపన నాలో మొదలైంది. రాజ్యసభ సభ్యుడిగా చుట్టూ ఉన్న వాటిని కొత్తకోణంలో చూడడం మొదలుపెట్టాను. అయితే అన్నింటినీ మించి నేను ఒక రచయితగా అక్కడికి వెళ్లాను కాబట్టి మా రచయితల కోసం ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. 

ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ పార్లమెంట్‌ సభ్యులుగా 2012లో రచయితల కోసం కాపీరైట్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటివరకు రచయితలకు ఏ హక్కు లేకుండా దోపిడీ చేయబడుతున్నారు. హాలీవుడ్‌లో ఒక సినిమా సూపర్‌హిట్‌ అయ్యిందంటే దాని మీద వచ్చే రాయల్టీతో ఆ రచయితలు జీవితాంతం బ్రతికేస్తారు. ఆ చట్టాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. కానీ, అది అమలు కాలేదు. 12 సంవత్సరాలుగా ప్రముఖ రచయిత అంజుమ్‌ రాజబాలి దాని కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ఆమధ్య అక్కడికి వెళ్లినపు పియూష్‌ గోయల్‌గారితో, మిగతావారితో మాట్లాడడం జరిగింది. అది పాస్‌ అయింది. దాని ఎక్సిక్యూషన్‌ కూడా స్టార్ట్‌ అయింది. ఈ సంవత్సరం నుంచే అందులో డబ్బు రావడం మొదలవుతుంది. ఆ చట్టం ఎంత గొప్పదంటే.. ఒక సినిమాకి థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే ఇన్‌కమ్‌ వల్ల రచయితలకు బెనిఫిట్‌ జరుగుతుంది. ఏ మాధ్యమంలోనైనా ఒక సినిమాను ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు వచ్చిన ఆదాయంలో సగం పక్కన పెడతారు. అందులో సగం నిర్మాతకు, సగం రచయితలకు వెళ్తుంది. అది కథారచయిత, స్క్రీన్‌ప్లే రైటర్‌, డైలాగ్‌ రైటర్స్‌కి వర్తిస్తుంది. అయితే ఆ ఎమౌంట్‌ని ఎలా పంచుకోవడం అనేది మన ఇష్టం. ఆ ఇన్‌కమ్‌ ఈ సంవత్సరం నుంచే రావడం మొదలవుతుంది. ఒక రాజ్యసభ సభ్యుడిగా మా రచయితల కుటుంబాల కోసం నేను చేస్తున్న మంచి పని ఇది. ఇలాంటి ఇన్‌కమ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి, గేయ రచయితలకు, సింగర్స్‌కి వస్తున్నాయి. మా రచయితలకు మాత్రం రావడం లేదు. ఇప్పుడు దానికి మోక్షం వచ్చింది’ అంటూ ఆ గుడ్‌న్యూస్‌ తాలూకు వివరాలను తెలియజేశారు విజయేంద్రప్రసాద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here