ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు.. ఒకప్పుడు తెలుగు చిత్రసీమను శాసించిన హీరోలు.. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి హీరోలు నాలుగు దశాబ్దాలుగా తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నలుగురు హీరోలు విభిన్నమైన ఇమేజ్‌ వున్నవారు. అయితే ఈ నలుగురిలో నాగార్జునకు మాత్రం ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉందని చెప్పొచ్చు. కొత్త డైరెక్టర్లని ప్రోత్సహించడంలో, కొత్త తరహా సినిమాలు చెయ్యడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు అక్కినేని నాగార్జున. తన కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్లను, టెక్నీషియన్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తన ఇమేజ్‌ కంటే కంటెంట్‌నే ఎక్కువ నమ్ముతారు అనడానికి నాగార్జున కెరీర్‌లో చేసిన సినిమాలే నిదర్శనం. తొలి సినిమా ‘విక్రమ్‌’ నుంచి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయిన ‘నా సామిరంగా’ వరకు చేసిన సినిమాలన్నీ విభిన్నమైనవే. టాలీవుడ్‌ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్ట్‌ 29. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని విశేషాల గురించి, అరుదైన అంశాల గురించి తెలుసుకుందాం. 

1986లో అక్కినేని నాగార్జున తొలి సినిమా ‘విక్రమ్‌’ విడుదలైంది. హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘హీరో’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి అక్కినేని ఫ్యాన్స్‌ వేలాదిగా తరలివచ్చారు. అదే రోజు 2,000 అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌ ప్రారంభించడం విశేషం. తొలి సినిమాతోనే హీరోగా తనని తాను ప్రూవ్‌ చేసుకున్నారు నాగార్జున. ఆరోజుల్లోనే ‘విక్రమ్‌’ ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. అదేమిటంటే.. విశాఖపట్నంలో ఈ సినిమా 8 థియేటర్లలో రిలీజ్‌ అయింది. అప్పటివరకు ఆ ఏరియాలో అన్ని థియేటర్లలో ఏ సినిమా కూడా రిలీజ్‌ అవ్వలేదు. ఈ సినిమా 17 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైంది. విజయవాడ శైలజ థియేటర్‌లో 100 రోజులు రన్‌ అయింది. ఇదీ నాగార్జున తొలి సినిమా విశేషాలు. 

విక్రమ్‌ తర్వాత కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ వంటి ఫ్లాప్‌ సినిమాలు నాగార్జునను నిరాశపరిచాయి. అదే సమయంలో దర్శకరత్న దాసరి నారాయణరావు మజ్ను పేరుతో రూపొందించిన ప్రేమకథా చిత్రం ఘనవిజయం సాధించి నాగార్జునకు హీరోగా మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత చేసిన సంకీర్తన మ్యూజికల్‌హిట్‌గా నిలిచినప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఆ తర్వాత హీరోగా మరో బ్రేక్‌నిచ్చిన సినిమా ఆఖరిపోరాటం. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాల్లో జానకిరాముడు, విక్కీదాదా చిత్రాలు నాగార్జునకు మంచి విజయాల్ని అందించాయి. ఇక 1989 నాగార్జున కెరీర్‌లో ఓ అరుదైన సంవత్సరంగా, అతన్ని స్టార్‌ హీరోగా చేసిన సంవత్సరంగా చెప్పొచ్చు. గీతాంజలి, శివ వంటి రెండు విభిన్నమైన సినిమాలు ఒకే ఏడాది రిలీజ్‌ అవ్వడం అనేది ఏ హీరో విషయంలో జరగలేదనే చెప్పాలి. మణిరత్నం అప్పటికే తమిళ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో డిఫరెంట్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నారు. అయితే మణిరత్నం డైరెక్ట్‌ చేసిన ఏకైక తెలుగు చిత్రం గీతాంజలి. ఈ సినిమాలో ఓ క్యాన్సర్‌ పేషెంట్‌గా విషాదభరితమైన క్యారెక్టర్‌లో నటించారు నాగార్జున. ఈ సినిమా ఘనవిజయం సాధించి నాగార్జునకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. అదే ఏడాది అక్టోబర్‌లో విడుదలైన శివ చిత్రంతో కొత్త చరిత్రను సృష్టించారు నాగార్జున. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం అనేది ఆ సినిమాతోనే ప్రారంభమైంది. రామ్‌గోపాల్‌వర్మను పరిచయం చేస్తూ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో నిర్మించిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ సైతం షాక్‌ అయింది. సినిమాను ఇలా కూడా తీయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఒక ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు వర్మ. ఇక అప్పటి నుంచి కొత్తదనం కోసం ఎన్నో సినిమాలు చేశారు నాగార్జున. ఆ క్రమంలోనే లెక్కకు మించిన అపజయాలు ఎదురయ్యాయి. ఆ సమయంలోనే కొన్ని కమర్షియల్‌ హిట్స్‌తో తన ఉనికిని కాపాడుకున్నారు. 

1996లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రంతో రొమాంటిక్‌ సినిమాలతో సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలనని ప్రూవ్‌ చేసుకున్నారు. ఆ మరుసటి సంవత్సరమే ఓ కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రం చేస్తున్నట్టు ప్రకటించి మరోసారి ప్రేక్షకుల్ని, ఇండస్ట్రీని షాక్‌కి గురి చేశారు నాగార్జున. యాక్షన్‌ హీరోగా, రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకుంటున్న నాగార్జున భక్తి రస చిత్రం చేయడం కరెక్ట్‌ కాదనే అభిప్రయాన్ని వ్యక్తపరిచిన వారు కూడా ఉన్నారు. అయినా సినిమాపై తనకున్న పూర్తి నమ్మకంతో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ సినిమాను పూర్తి చేసి తనలోని కొత్తకోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాగార్జున కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌లా ఆ సినిమా నిలబడిపోయింది. ఆ తర్వాత అదే కోవలో శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి సినిమాల్లోనూ తన అసమాన నటనతో ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. పక్కా కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే భక్తిరస చిత్రాలతోనూ అలరించడం నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. 

తండ్రికి తగ్గ తనయుడిగా రొమాంటిక్‌ హీరోగానే కాదు, పూర్తి స్థాయిలో హాస్యాన్ని, సెంటిమెంట్‌ని పండించే హీరోగా నాగార్జున ఒక డిఫరెంట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. తన సమకాలీనుల్లో ఏ హీరో కూడా ఆ స్థాయి ఇమేజ్‌ని సాధించలేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ తన ప్రతిభతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నాగార్జున నటించిన తొలి హిందీ సినిమా శివ. ఈ సినిమా తర్వాత అడపా దడపా నాగార్జున మాత్రమే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చెయ్యగలడు అనే స్థాయిలో ఉన్న పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్నారు. వయసు రీత్యా ప్రస్తుతం తనకు ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ తరహా పాత్రల్నే ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మూసధోరణిలో వెళ్ళకుండా ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నా సామిరంగా చిత్రంతో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ధనుష్‌తో కలిసి కుబేర చిత్రం చేస్తున్నారు. 

నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా విజయాలు సాధిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలనే ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున సాధించిన అవార్డుల విషయానికి వస్తే ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నిన్నేపెళ్లాడతా చిత్రానికి నిర్మాతగా, అన్నమయ్యలోని నటనకుగాను జాతీయ స్థాయిలో ప్రశంసగా నేషనల్‌ అవార్డులు అందుకున్నారు. పలు చిత్రాల్లో అసమాన నటనను ప్రదర్శించిన నటుడిగా, ఉత్తమ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా 10 సార్లు నంది అవార్డును సాధించారు. ఇవి కాక నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు, వివిధ సంస్థల అవార్డులు ఆయన్ని వరించాయి. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకొని ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్ట్‌ 29. ఈ సందర్భంగా ఈ టాలీవుడ్‌ మన్మథుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగువన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here