రాష్ట్రమంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామగుండంలోని 800 మెగావాట్ల టీజీ విద్యుత్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించి, రూ.3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0, టి.యూ.ఎఫ్.డి. ఐ.సి కింద చేపట్టే పలు అభివృద్ధి పనులకు, సింగరేణి ఆధ్వర్యంలో రూ.5 కోట్ల నిధులతో 23 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 211 మహిళా సంఘాలకు 23 కోట్ల 35 లక్షల 50 వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. మేడిపల్లిలోని ఆర్జీ 1 మినీ ఓసీపీని సందర్శించి ఓసీపీలో నిల్వ ఉన్న ఒక టీఎంసీ నీటితో జల విద్యుత్ ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించారు.