తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సృష్టిస్తున్న బీభత్సం అందర్నీ కలచివేస్తోంది. ఎంతో మంది నిరాశ్రయులై సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు ఎస్‌.రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా వరద బాధితుల కోసం రూ.50 లక్షలు ప్రకటించారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు అందిస్తారు. దీనికి సంబంధించి వారు చేసిన ప్రకటనలో ‘తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని కలచివేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ.. మా వంతు సాయం అందిస్తున్నాము’ అని తెలిపారు. అలాగే యువనటుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తెలుగు రాష్ట్రాలోని పరిస్థితిపై స్పందిస్తూ ‘తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం ఎంతో బాధాకరం. ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేసాయి. ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు తోడుగా ఉండడం ఎంతో అవసరం. అందుకే వరద బాధితుల సహాయార్థం నా వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.30 లక్షలు ప్రకటిస్తున్నాను. ఈ సహాయం కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. 

చిత్ర పరిశ్రమ నుంచి వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ రెండు రాష్ట్రాలకు రూ.50లక్షలు చొప్పున కోటి రూపాయలు, వైజయంతి మూవీస్‌ సంస్థ ఆంధ్రపదేశ్‌కు రూ.25 లక్షలు, హీరో విశ్వక్‌సేన్‌ ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 లక్షలు విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here