తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురవడం, తద్వారా సంభవించిన వరదల కారణంగా కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. లక్షల మంది వరదల బారిన పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు వరదల కారణంగా పూర్తిగా నీటిమయం అయ్యాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి విపత్తు సంభవించినా మేమున్నామంటూ అన్ని రంగాల కంటే ముందుగా సినిమా రంగం ముందుకొస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది ప్రముఖులు వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వర్షాల వల్ల రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి సినీ ప్రముఖుల చలించిపోతున్నారు. తమకు ఒక స్థాయిని కల్పించిన ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకు నడుం కడుతున్నారు. 

దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా విరాళం అందించడంలో భారీ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం రూ.5 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు సినీ ప్రముఖులు ప్రకటించిన విరాళాల్లో ఇది భారీ మొత్తంగా చెప్పొచ్చు. అంతేకాదు, వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, మంచి నీటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు ప్రభాస్‌. కొన్ని రోజుల క్రితం కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల నష్టం వాటిల్లింది. వయనాడ్‌ బాధితుల కోసం సినీ ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే అందరి కంటే ఎక్కువ మొత్తంలో ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళాన్ని ప్రకటించడం విశేషం. 

మెగాస్టార్‌ చిరంజీవి వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు. వరదల్లో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు త్వరగా కోలుకొని సాధారణ పరిస్థితుల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ కూడా రూ.1 కోటి సాయాన్ని అందిస్తున్నారు. ఈ వరద బీభత్సంలో భారీగా నష్టపోయిన ప్రజలంతా ధైర్యంగా ఉండాలని కోరారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా రూ.1 కోటి రూపాయల సాయాన్ని అందించారు. వరద బాధితుల కష్టాలను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా రూ.1 కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. వరదల బారిన పడిన ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ కూడా రూ. 1 కోటి విరాళాన్ని అందిస్తున్నానని ఎనౌన్స్‌ చేశారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సం నుంచి ప్రజలు త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు చినబాబు, నాగవంశీ సంయుక్తంగా రూ.50 లక్షలు ప్రకటించారు. ఈ విరాళాలన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధిగా సమానంగా అందించారు. ఇక వైజయంతి మూవీస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రమే రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు.

టాప్‌ హీరోలే కాదు వర్థమాన తారలు, సాంకేతిక నిపుణులు కూడా వరద బాధితుల సహాయార్థం ఆర్థిక సాయాన్ని అందించారు. సిద్ధు జొన్నలగడ్డ రెండు రాష్ట్రాలకు రూ.15 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. మరో హీరో విశ్వక్‌ సేన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రమే రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. దర్శకుడు వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని చేస్తున్నారు. ఇక హీరోయిన్లలో అనన్య నాగళ్ళ ఒక్కరే స్పందించారు. ఆమె రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున తన విరాళాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ప్రకృతి విపత్తు ఏర్పడినప్పుడు ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీయే అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సార్లు రాష్ట్రం వరదల తాకిడికి గురైంది. ప్రతిసారీ తమవంతు సాయం అందిస్తూ ప్రేక్షకుల రుణం తీర్చుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటివరకు ప్రజలను ఆదుకునేందుకు కొందరు ప్రముఖులు మాత్రమే ముందుకొచ్చారు. ఇంకా ఎంతమంది సహాయం చేసేందుకు సిద్ధపడతారో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here