తారాగణం: నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, అరుణ్ దేవ్, ప్రియదర్శి, భాగ్యరాజ్, గౌతమి, కృష్ణతేజ, అభయ్, అనన్య తదితరులు

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

ఎడిటర్: టి.సి. ప్రసన్న

మాటలు: నందకిషోర్‌ ఈమాని, ప్రశాంత్‌ విఘ్నేష్‌ అమరవాది

రచన, దర్శకత్వం: నందకిషోర్ ఈమాని

బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్

సమర్పణ: రానా దగ్గుబాటి

నిర్మాత: సృజన ఎర్రబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి

విడుదల తేదీ: సెప్టెంబర్ 6, 2024 

 

ఇటీవల కాలంలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రాలలో ’35 చిన్న కథ కాదు’ ఒకటి. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించడం, రానా దగ్గుబాటి సమర్పకుడు కావడంతో ఈ సినిమా పట్ల అందరిలో ఆసక్తి ఏర్పడింది. పైగా రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయడం ఈ సినిమా పట్ల మేకర్స్ కి ఉన్న నమ్మకాన్ని తెలియజేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? చిత్రం బృందం నమ్మకం నిజమై, ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ:

సరస్వతి(నివేదా థామస్) సాధారణ గృహిణి. ఆమె భర్త ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) బస్ కండక్టర్. వీరికి ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్. చిన్న కొడుకు వరుణ్ అందరి పిల్లల్లాగే సాధారణంగానే ఉంటాడు. కానీ పెద్ద కొడుకు అరుణ్ మాత్రం మిగతా వారికి కాస్త భిన్నం. ఆరవ తరగతి చదివే అరుణ్.. ఎప్పుడూ ఏదోక ప్రశ్న అడుగుతూనే ఉంటాడు. లాజిక్ తెలియకుండా ఏ విషయాన్నీ నేర్చుకోడు. గుడ్డిగా బట్టీ పట్టడానికి అసలు ఇష్టపడడు. మిగతా అన్ని సబ్జెక్టులు బాగానే చదివే అరుణ్.. తన ప్రశ్నలకు సమాధానాలు దొరకని, తన లాజిక్స్ కి అందని మ్యాథ్స్ ని అసలు దగ్గరకు రానివ్వడు. దీంతో మ్యాథ్స్ లో ఎప్పుడూ సున్నా మార్కులే వస్తుంటాయి. లెక్కల మాస్టర్ చాణక్య(ప్రియదర్శి) అయితే అతన్ని జీరో అని పిలుస్తుంటాడు. అరుణ్ డౌట్స్ కి టీచర్లు సమాధానం చెప్పలేక పిచ్చివాడిలా చూస్తుంటాడు. మిగతా పిల్లలు కూడా అరుణ్ ని దూరం పెడుతుంటారు. దానికి తోడు ఒక క్లాస్ డిమోట్ అయ్యి తన తమ్ముడు వరుణ్ క్లాస్ లోకి వస్తాడు. ఈ క్రమంలో అరుణ్ కి ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది. అదేంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ మార్క్ 35 తెచ్చుకోవడం. అతన్ని పాస్ చేసే బాధ్యతను తల్లి సరస్వతి తీసుకుంటుంది. టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని సరస్వతి.. తన కొడుకుని మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ చేయడం కోసం ఏం చేసింది? అరుణ్ లాజిక్స్ కి సమాధానం దొరికి, అతను మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాడా? అరుణ్ కారణంగా సరస్వతి, ప్రసాద్ మధ్య మాటలు లేకుండా ఎందుకు పోయాయి? చివరికి సరస్వతితో ప్రసాద్ మాట్లాడాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

 

విశ్లేషణ:

’35 చిన్న కథ కాదు’ అనేది నిజానికి చిన్న కథే. మ్యాథ్స్ లో జీరో అని పిలిపించుకుంటున్న తన కొడుకుని, హీరోని చేయడం కోసం ఒక తల్లి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. అయితే ఇది చిన్న కథ అయినప్పటికీ ఒక మంచి కథ. ఆలోచింపచేసే కథ. తల్లీకొడుకుల కథ. పిల్లలతో తల్లిదండ్రులు, గురువులు, తోటి విద్యార్థులు ఎలా ఉండాలో చెప్పే కథ. ఇందులో హిందీ చిత్రం ‘తారే జమీన్ పర్’ ఛాయలు కొంత కనిపించినప్పటికీ, స్వచ్ఛమైన అచ్చతెలుగు చిత్రమిది.

దర్శకుడు నందకిషోర్ ఈమని ఎంచుకున్న కథ బాగుంది. ఆ కథని అంతే అందంగా తెరమీదకు తీసుకురావడంలో ఆయన విజయం సాధించాడు. మొదట సరస్వతి కుటుంబాన్ని, వారి పాత్రల స్వభావాన్ని దర్శకుడు చూపించాడు. ఈ క్రమంలో అసలు కథలోకి వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. దాంతో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రం ప్రధానంగా తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలోనే సాగుతుంది. కొడుకు అడిగే ప్రశ్నలకు తనకు తెలిసిన సమాధానాలు చెప్తూ, అతను అలాగే లాజికల్ గా ఆలోచించేలా ఎంకరేజ్ చేస్తుంది తల్లి. బెస్ట్ ఫ్రెండ్ దూరమై బాధలో ఉన్న కొడుకుకి మంచి మాటలు చెప్పి, మరొకరితో స్నేహం చేసేలా చేస్తుంది. చివరికి అతన్ని మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ చేయడం కోసం టీచర్ లా కూడా మారుతుంది. ఇలా కొడుకు గెలుపు కోసం అడుగడుగునా తపన పడుతుంది. ఆ సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. అయితే దర్శకుడు కథని పొయెటిక్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ఓవరాల్ గా మాత్రం మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో సరస్వతి కుటుంబాన్ని తిరుపతిలో నివశించే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అన్నట్టుగా చూపించారు. అందుకు తగ్గట్టుగానే సంగీతం సంప్రదాయబద్ధంగా, వినసొంపుగా ఉంది. నికేత్ బొమ్మి కెమెరా పనితనం ఆకట్టుకుంది. సన్నివేశాల్లో ఉన్న సహజత్వాన్ని, భావోద్వేగాలను ఎంతో అందంగా కెమెరాలో బంధించారు. టి.సి. ప్రసన్న ఎడిటింగ్ నీట్ గా ఉంది. నందకిషోర్‌ ఈమాని, ప్రశాంత్‌ విఘ్నేష్‌ అమరవాది సంభాషణలు కట్టిపడేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

 

నటీనటుల పనితీరు:

పదేళ్ల కొడుకు గెలుపు కోసం పరితపించే తల్లి సరస్వతి పాత్రలో నివేదా థామస్ చక్కగా ఒదిగిపోయింది. ఆహార్యం, అభినయంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా రాణించింది. భార్య పిల్లలంటే ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, పరిస్థితులకు తగ్గట్లుగా పైకి కఠినంగా కనిపించే ప్రసాద్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ ఆకట్టుకున్నాడు. ఇక కథకి కీలకమైన అరుణ్ పాత్రకు అరుణ్ దేవ్ పూర్తి న్యాయం చేశాడు. అతని ప్రశ్నలు, మాటలు, చేష్టలు.. నవ్విస్తాయి, ఆలోచింపచేస్తాయి, భావోద్వేగానికి గురిచేస్తాయి. లెక్కల మాస్టర్ చాణక్యగా ప్రియదర్శి తన మార్క్ చూపించాడు. స్కూల్ ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి పాత్రలో భాగ్యరాజ్ హుందాగా ఉన్నారు. గౌతమి, కృష్ణతేజ, అభయ్, అనన్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

ఫైనల్ గా…

’35 చిన్న కథ కాదు’ అనేది ఒక మంచి ప్రయత్నం. పదేళ్ల కొడుకుని మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ చేయడం కోసం తల్లి పడే తపన హత్తుకుంది. సన్నివేశాలు నెమ్మదిగా సాగినప్పటికీ.. మంచి కథ, భావోద్వేగాలు ఈ సినిమాని నిలబెట్టాయి. 

 

రేటింగ్: 2.75/5 

– గంగసాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here