సౌత్ ఇండియాలో హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సాయిపల్లవి ఇల్లు గత కొంతకాలంగా పెళ్లి వాతావరణంతో కళకళలాడిపోతోంది. ఆమధ్య సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ నిశ్చితార్థం వినీత్తో జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం సెప్టెంబర్ 5న ఘనంగా జరిగింది. కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో ఈ వివాహాన్ని నిర్వహించారు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఘట్టంలోనూ సాయిపల్లవి దగ్గరే ఉండి సోదరి వివాహాన్ని వైభవంగా జరిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్స్ లక్షల సంఖ్యలో ఉంటారు. సాయిపల్లవి షేర్ చేసిన సోదరి పెళ్లి ఫోటోలను అందరూ షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సాయిపల్లవికి హీరోయిన్గా ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె సోదరి పూజ కూడా తెరంగేట్రం చేసి అక్కలా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘చితిరై సెవ్వానం’ అనే సినిమాలో పూజ హీరోయిన్గా నటించింది. 2021లో ఈ సినిమా విడుదలైంది. అయితే సాయిపల్లవి రేంజ్లో కాకపోయినా ఓ మోస్తరు పాపులారిటీ కూడా పూజకు రాలేదు. దీంతో తనకు సినిమాలు సరిపడవని గ్రహించింది. అందుకే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకుంది. తన చిరకాల మిత్రుడు వినీత్తో ఎంతో కాలంగా ప్రేమలో ఉంది పూజ. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి వారి అంగీకారంతోనే పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.