మూవీ : భార్గవి నిలయం

నటీనటులు: టొవినో థామస్, షైన్ టామ్ చాకో, రోషన్ మాథ్యూ, రీమా కల్లింగల్ తదితరులు

ఎడిటింగ్:   వి సాజన్

మ్యూజిక్: బిజిబల్

సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్

నిర్మాతలు : రాజశేఖర్ అన్నభీమోజు

దర్శకత్వం: ఆశిఖి అబు

ఓటీటీ : ఆహా

టొవినో థామస్, షైన్ టామ్ చాకో, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలు పోషించిన మలయాళ సినిమా ‘నీలవెలిచం’. ఈ సినిమా ఇప్పుడు ‘భార్గవి నిలయం’ పేరుతో ‘ఆహా’ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం.

కథ:

ఈ కథ సముద్రతీరంలోని ఒక చిన్న గ్రామంలో సాగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆ ఊరు కేరాఫ్ అడ్రెస్ లా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ గ్రామానికి ఒక రచయిత (టొవినో థామస్) వస్తాడు. ఒక పాడుబడిన బంగ్లాలో అద్దెకి దిగుతాడు. తాను ఉండటానికి వీలుగా ఆ బంగ్లాను నీట్ గా చేసుకుంటాడు. అయితే ఆ ఇంటివైపు రావడానికి పోస్ట్ మెన్, హోటల్ కుర్రాళ్లు భయపడటం అతను గమనిస్తాడు. ఆ ఊళ్లోనే ఉంటున్న తన స్నేహితులను కలుస్తాడు. అతను భార్గవి నిలయంలో అద్దెకు దిగాడని తెలియగానే స్నేహితులు కంగారు పడిపోతారు. గతంలో ఆ ఇంట్లో భార్గవి అనే ఒక యువతి ఉండేదని, ఆమెకి నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉందని చెబుతారు. ఆ పక్కనే ఉన్న ఇంట్లో శశికుమార్ (రోషన్ మాథ్యూ) అనే గాయకుడు ఉండేవాడని అంటారు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారని, అయితే భార్గవిని శశికుమార్ మోసం చేయడంతో.. ఆ ఇంట్లోని బావిలో దూకేసి భార్గవి ఆత్మహత్య చేసుకుందని.. అప్పటి నుంచి ఆమె దెయ్యమై తిరుగుతుందని అంటారు. అందుకే ఇంట్లో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదని, అసలు అటువైపు వెళ్లొద్దని స్నేహితులు చెబుతారు. అయినా ఆ రచయిత వినిపించుకోకుండా ఆ ఇంటికి వెళతాడు. భార్గవి జీవితంలో అసలేం జరిగింది. ఆమెది హత్యనా .. ఆత్మహత్యనా? అనే కోణంలో అతని అన్వేషణ మొదలవుతుంది. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి నిజాలు తెలిసాయి.. అప్పుడు అతను ఏం చేశాడనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇది 1964 లో జరిగే కథ. దాంతో దర్శకుడు అప్పటి పరిస్థితులని, ఆ కాస్ట్యూమ్, అప్పటి ట్రెడిషన్ ని బాగా క్రియేట్ చేశాడు. అయితే అతను హారర్ కథని ఎంచుకోవడమే కాస్త నిరాశ పరుస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో రచయిత కావ్యం, గాయకుడి సాధన, నాట్యంలో ప్రావీణ్యం పొందిన భార్గవి.. ఇలా ఇంపాక్ట్ ఇచ్చే పాత్రలని రాసుకున్న కథని ఓ హారర్ కథతో తీసుకురావడం అంతగా కనెక్ట్ అవ్వదు.

సినిమా అంతా కూడా స్లో పేస్ లోనే వెళ్తుంది. రెండు గంటల పైన నిడివి అనవసరం అనిపిస్తుంది. సాధారణంగా మలయాళ సినిమాల్లో ల్యాగ్ ఉండదు. కానీ‌ ఇందులో  పాత్రల ఇంపాక్ట్ కోసం‌ డీటేయిలింగ్ ఎక్కువగా ఇచ్చాడు దర్శకుడు. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రచయిత పాయింటాఫ్ వ్యూలో కథ బాగున్నప్పటికి కామన్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ట్విస్ట్ లు లేవు.‌ సాధారణంగా మనం ఊహించిందే కథలో జరుగుతుంది.

తెలుగు డబ్బింగ్ అంతగా కుదరలేదు. అయితే రచయిత దృష్టికోణంలో ఆలోచించగలిగితే ఈ మూవీ కాస్త నచ్చే అవకాశం ఉంది. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు వాడలేదు. కొన్ని హారర్ సీన్స్  ఉండటం వల్ల చిన్నపిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్. సినిమాకి ప్రధానబలంగా నిలిచింది సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

రచయితగా టొవినో థామస్ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. షైన్ టామ్ షాకో, రోషన్ మాథ్యూ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా…

ఓన్లీ ఫర్ టెక్నికల్ వర్క్. వన్ టైమ్ వాచెబుల్

రేటింగ్ : 2.25/5

✍️. దాసరి మల్లేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here