తారాగణం: రాజ్ తరుణ్, మినీషా, అభిరామి, సింగీతం శ్రీనివాస్, హైపర్ ఆది, సుదర్శన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు 

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్లా

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్

దర్శకత్వం: శివసాయి వర్ధన్

నిర్మాత: ఎన్.వి. కిరణ్ కుమార్

సమర్పణ: మారుతి

బ్యానర్: రవి కిరణ్ ఆర్ట్స్, మారుతీ టీం

విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2024 

‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తో హీరోగా కెరీర్ ని స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్.. ఆ తరువాత వరుస పరాజయాలతో నిరాశపరిచాడు. ఒకట్రెండు మినహా దాదాపు సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఓ మంచి హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ కి హిట్ ఇచ్చేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Bhale Unnade Movie Review)

కథ:

రాధ (రాజ్ తరుణ్) వైజాగ్ లో శారీ డ్రేపర్ గా పని చేస్తుంటాడు. అతని తల్లి గౌరీ (అభిరామి) బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంటుంది. రాధ ‘రాముడు మంచి బాలుడు’ టైపు. ఇంటి పనుల్లోనూ తల్లికి సాయం చేస్తుంటాడు. గౌరీ పని చేసే బ్యాంక్ లోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ (మనీషా). కృష్ణ మోడరన్ అమ్మాయి. గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని, రాధ వంటలకు ఫ్యాన్ అవుతుంది. లంచ్ బాక్స్ లో చీటీలు పెట్టి రాయబారం పంపుతూ కృష్ణ, రాధ ఒకరికొకరు దగ్గరవుతారు. చూసుకోకుండానే ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటారు. బయట పరిచయమయ్యాక పెద్దల అంగీకారంతో పెళ్ళికి కూడా సిద్ధమవుతారు. ఈ క్రమంలో కృష్ణ శారీరికంగా కలిసే అవకాశమిచ్చినా రాధ దూరం పెడుతుంటాడు. మరోవైపు నిశ్చితార్థం సమయంలో ఫ్రెండ్ చెప్పిన విషయంతో.. అసలు రాధ పెళ్లికి పనికొస్తాడా లేదా? అనే అనుమానం కృష్ణకి కలుగుతుంది. అతనికి టెస్ట్ చేయించడానికి కూడా సిద్ధపడుతుంది. అసలు రాధ అమ్మాయిలకు దూరంగా ఉండటానికి కారణమేంటి? అతనికి నిజంగానే ఏమైనా సమస్య ఉందా? రాధ, కృష్ణ ల పెళ్లి జరిగిందా లేదా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

ఈ రోజుల్లో మంచితనాన్ని నేరంగా చూస్తుంటారు. రాముడిలా బుద్ధిగా ఉంటే తేడాగాడు అనే ముద్ర వేసే సమాజం ఇది. ఇలాంటి కాలంలో ‘భలే ఉన్నాడే’ లాంటి కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. అయితే స్టోరీ లైన్ గా బాగున్నప్పటికీ.. దానిని ఆకట్టుకునేలా మలచడంలో మాత్రం దర్శకుడు విజయం సాధించలేకపోయాడు. ప్రథమార్థం కొంతవరకు పరవాలేదు. ప్రేమ, హాస్య సన్నివేశాలతో బాగానే నడిచింది. అయితే అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మెయిన్ స్టోరీలోకి వెళ్ళాక మరింత ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాల్సింది పోయి చేతులెత్తేశాడు. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం పూర్తిగా తేలిపోయింది. కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. పతాక సన్నివేశాలు కూడా తేలిపోయాయి. ఇటువంటి కథని అటు వినోదం, ఇటు భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించవచ్చు. కానీ దర్శకుడు ఆ రెండు విషయాల్లోనూ నిరాశపరిచాడు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

రాధ పాత్రలో రాజ్ తరుణ్ పర్ఫామెన్స్ డీసెంట్ గా ఉంది. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. కృష్ణ పాత్రకి తగ్గట్టుగా మినీషా అందంగా, చలాకీగా కనిపించింది. రాజ్ తరుణ్ తల్లి గౌరీ పాత్రలో అభిరామి ఆకట్టుకుంది. సినిమాలో సింగీతం శ్రీనివాస్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైపర్ ఆది, సుదర్శన్ అక్కడక్కడా నవ్వించారు. గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

శేఖర్ చంద్ర సంగీతం పెద్దగా మెప్పించలేదు. పాటలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. నగేష్ కెమెరా పనితనం బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణాలు విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా..

ఇటీవల నెలకొక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్న రాజ్ తరుణ్.. మంచి విజయం కోసం తన ఎదురుచూపులు కొనసాగించక తప్పదు. ఆలోచన పరంగా ‘భలే ఉన్నాడే’ స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ.. స్క్రీన్ మీద రెండు గంటల పాటు అలరించే సినిమాగా మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది.

రేటింగ్: 2.25/5  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here