తారాగణం: సాయి తేజ, పావని కరణం, డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు

సంగీతం: యశ్వంత్ నాగ్

డీఓపీ: సందీప్ బద్దుల

ఎడిటర్: రవితేజ, శైలేష్ దరేకర్

దర్శకత్వం: ఆనంద్ గుర్రం

నిర్మాతలు: రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ 

బ్యానర్: హ్యాపీ హార్స్ ఫిలిమ్స్

విడుదల తేదీ: సెప్టెంబర్ 20, 2024 

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పైలం పిలగా’. సాయి తేజ, పావని కరణం జంటగా నటించిన ఈ సినిమాలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

గాల్లో మేడలు కట్టే శివ(సాయి తేజ) దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. దుబాయ్ వెళ్లాలనే శివ కల నెరవేరడం కోసం అతని నానమ్మ ఒక దారి చూపిస్తుంది. ఒక స్థలం ఉంది, ఇది అమ్మితే డబ్బు వస్తుంది, దుబాయ్ వెళ్ళవచ్చు అని చెబుతుంది. దీంతో శివ తన స్నేహితుడు శ్రీను (ప్రణవ్ సోను) తో కలిసి స్థలం అమ్ముదామని అనుకుంటాడు. కానీ ఆ స్థలం లిటికేషన్ లో ఉంటుంది. మరోవైపు తనకు పూర్తిగా భిన్నంగా, డబ్బుపై ఆశలేని దేవి(పావని కరణం) అనే అమ్మాయిని శివ ప్రేమిస్తాడు. దుబాయ్ వెళ్లాలనుకున్న శివ ప్లాన్ ఏమైంది? దేవితో అతని ప్రేమ పెళ్లిపీటలు ఎక్కిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

హీరోనేమో పైసాను ప్రేమించే పిలగాడు. హీరోయిన్ ఏమో ప్రకృతిని ప్రేమించే పిల్ల. గాల్లో మేడలు కట్టే అబ్బాయి, చిన్న గూడైనా సంతోషంగా ఉంటే చాలు అనుకునే అమ్మాయి మధ్య ప్రేమ కథగా ‘పైలం పిలగా’ రూపొందింది. దుబాయ్ వెళ్లి కోట్లు సంపాదించాలి, ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలని ఆరాటపడే హీరో.. తనకి పూర్తి భిన్నమైన వ్యక్తికత్వం ఉన్న అమ్మాయితో ప్రేమలో పడ్డాక.. అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది వినోదాత్మకంగా చెప్పారు. 

డైరెక్టర్ ఆనంద్ గుర్రం రాసుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో బోర్ కొట్టకుండా సినిమాని మలిచాడు. హాస్యభరిత వ్యంగ చిత్రంగా రూపొందిన ‘పైలం పిలగా’లో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలను కళ్ళకు కిట్టినట్లు చూపించారు. దర్శకుడిగా మొదటి సినిమానే అయినప్పటికీ మంచి ప్రతిభ కనబరిచారు.

యస్వత్ నాగ్ సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. సందీప్ బద్దుల కెమెరా పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సాయి తేజ, పావని కరణం వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా…

హాస్యభరిత వ్యంగ చిత్రంగా రూపొందిన ‘పైలం పిలగా’ను పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా హ్యాపీగా చూసేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here