దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం తిరుమల లడ్డు. అందరూ పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసింది అనే వివాదం గత కొన్ని రోజులుగా తెరపై ఉంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాల్ని చెబుతూ వస్తున్నారు. దీని గురించి ఎవరిని కదిలించినా.. అలా చేయడం చాలా దారుణమని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క విచారణ సక్రమంగా జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా కోరుతున్నారు. 

సినీ ప్రముఖులు ఎవరు, ఎక్కడ కనిపించినా తిరుమల లడ్డు గురించి చెప్పమని అడుగుతున్నారు. ఆ క్రమంలోనే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ని కూడా అడిగారు.  తన కొత్త సినిమా ‘వేట్టయాన్‌’ అక్టోబర్‌ 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు రజినీ. సినిమాకి సంబంధించిన ప్రశ్నలు పూర్తయిన తర్వాత తిరుమల లడ్డు కల్తీ జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు ‘సారీ, నో కామెంట్స్‌’ అని దాట వేశారు. దీనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఒక సూపర్‌స్టార్‌ అయి ఉండి దేశానికి, హిందు మతానికి సంబంధించిన పవిత్రమైన లడ్డు కల్తీ గురించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించడం చాలా దారుణం అని, నిన్న కార్తీ హేళనగా మాట్లాడాడని, ఈరోజు ఒక బాధ్యతగల హీరో తెలివిగా తప్పించుకున్నాడని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి. 

కొన్ని రోజుల క్రితం సత్యం సుందరం ఫంక్షన్‌లో ఆ సినిమా హీరో కార్తీని  యాంకర్‌  ‘లడ్డూ కావాలా నాయనా’ అడగడం, దానికి కార్తీ ‘ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌. మనకు వద్దు అది’ అని కామెడీగా చెప్పడం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ని బాధించింది. కార్తీ కామెంట్‌ చేసిన దానిపై ఆయన సీరియస్‌ అయ్యారు. ఆ తర్వాత కార్తీ స్పందిస్తూ తాను తప్పుగా మాట్లాడానని తనని క్షమించాల్సిందిగా పవన్‌కళ్యాణ్‌ని కోరారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళ్‌ టాప్‌ హీరో రజినీకాంత్‌.. తిరుమల లడ్డు విషయం తనకు సంబంధం లేదు అన్నట్టు నో కామెంట్స్‌ అని తప్పించుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్‌ అనేది అందరి ప్రశ్న. మరి ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న కామెంట్స్‌కి రజినీకాంత్‌ ఏం సమాధానం చెప్తారో, ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇలాంటి కామెంట్స్‌ చేసిన ఇద్దరూ తమిళ హీరోలు కావడం గమనార్హం. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here