ఏ సినిమా అయినా ప్రేక్షకులకు ఎంగేజింగ్‌గా ఉండాలంటే.. కథ, కథనం గ్రిప్పింగ్‌గా ఉండాలి. షూటింగ్‌ పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ చేసి ఫస్ట్‌ కాపీ వచ్చిన తర్వాత మేకర్స్‌ ఒకసారి చూసుకుంటారు. అనవసరమైన సీన్స్‌గానీ, ఆడియన్స్‌ ల్యాగ్‌ ఫీల్‌ అయ్యే అంశాలుగానీ ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ, ఏ డైరెక్టర్‌కైనా తను తీసిన ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందనే ఫీలింగ్‌ ఉంటుంది. కొన్ని సీన్స్‌ని కట్‌ చెయ్యాలంటే వారి మనసు ఒప్పుకోదు. అయితే థియేటర్‌లోకి వచ్చేసిన తర్వాత తమకు సినిమా ఎక్కడ బోర్‌ కొడుతోంది అనే విషయం ఆడియన్స్‌ ఠక్కున చెప్పెయ్యగలరు. అలా చాలా సినిమాలకు జరిగింది. ప్రేక్షకులకు బోర్‌ కొట్టించే అలాంటి సన్నివేశాలను చాలా సందర్భాల్లో తొలగించారు కూడా. ఇప్పుడు కార్తీ కొత్త సినిమా ‘సత్యం సుందరం’కి కూడా అదే పరిస్థితి వచ్చింది. కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్‌ అయింది. 

మానవ సంబంధాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. కాకపోతే నిడివి విషయంలో ఆడియన్స్‌ అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని గుర్తించారు మేకర్స్‌. 2 గంటల 57 నిమిషాల నిడివిఉన్న ఈ సినిమాలో ల్యాగ్‌ ఎక్కువగా ఉన్న సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీని వల్ల ప్రేక్షకుల్లో అసహనం పెరిగే అవకాశం ఉండడంతో దర్శకనిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండాలంటే కొన్ని సీన్స్‌ను కట్‌ చెయ్యాల్సిన అవసరం ఉందని భావించారు. ఈ విషయంలో అన్ని ఏరియాల వారి అభిప్రాయాలను తీసుకొని 18 నిమిషాల ఫుటేజ్‌ని కట్‌ చేశారు. దానివల్ల సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే తమిళ్‌లో కొత్త వెర్షన్‌ థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కూడా నిడివి తగ్గించాలని అనుకుంటున్నారట. అయితే తెలుగు వెర్షన్‌ విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటారా లేక దాన్నే కంటిన్యూ చేస్తారా అనే విషయంలో క్లారిటీ రాలేదు. తమిళ్‌ వెర్షన్‌ కంటే తెలుగు వెర్షన్‌ ఒకరోజు ఆలస్యంగా రిలీజ్‌ అయింది. పైగా దీనికి ‘దేవర’ కూడా పోటీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్‌ ‘సత్యం సుందరం’పై పడుతోంది. అక్టోబర్‌ 2 నుంచి దసరా సెలవులు మొదలవుతున్నాయి. దీంతో తెలుగులో కూడా కొత్త వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తే కలెక్షన్ల పరంగా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here