ఎన్నో దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. కానీ, గత కొద్దికాలంగా పరిశ్రమ ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతోంది. కొందరి వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది. అలాంటి పలు ఘటనలు ఇటీవల మనం చూశాం. ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమ మీద రాజకీయ నీడలు కూడా పడుతూ సినిమా వారికి రాజకీయ ప్రముఖుల నుంచి కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రస్తావన తెచ్చారు. ఆయనకి సినిమా వారితో సంబంధాలు ఉన్నాయని, ఆయన వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని నొక్కి చెప్పారు. విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరంగా చెప్పారు. ఇందులో నాగార్జున ప్రమేయం గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన నాగార్జున.. కొండా సురేఖ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. మా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడాన్ని ఆయన తప్పుపట్టారు. తమపై చేసిన ఆరోపణలను మంత్రి వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

కేటీఆర్‌పై, నాగార్జున కుటుంబంపై తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మరోసారి మీడియా ముందుకు వచ్చారు మంత్రి కొండా సురేఖ. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘నేను నిన్న గాంధీభవన్‌లో మాట్లాడేటప్పుడు కేటీఆర్‌గారి క్యారెక్టర్‌ గురించి, గతంలో వారు చేసిన కార్యక్రమాల గురించి, మహిళలపై వారికి ఉన్న చులకన భావం గురించి మాట్లాడాను. ఆయన కూడా నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో నేను భావోద్వేగానికి లోనై విమర్శలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఒక కుటుంబం పేరు నా నోటి నుంచి వచ్చింది. నాకు ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం లేదు. దీని గురించి నాగార్జునగారి ట్వీట్‌ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. నేను బాధపడుతున్న విషయంలో మరొకరిని నొప్పించానని తెలిసి నిన్న రాత్రి వెంటనే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్‌ చేశాను. నాకు జరిగిన అవమానం మరొకరికి జరగకూడదు అనే భావనతో దాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ, కేటీఆర్‌ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చేసిందంతా ఆయనే చేసి ఇప్పుడు నన్ను క్షమాపణ చెప్పాలని అడగడం.. తనే దొంగ అయినా దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది మాత్రం లేదు’ అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here