తారాగణం: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, ప్రభాస్ శ్రీను, రూప లక్ష్మీ తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

డీఓపీ: సాయి శ్రీరామ్

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్ కుమార్

రచన, దర్శకత్వం: సందీప్‌ రెడ్డి బండ్ల

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి

బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్

విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024 

కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్.. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో అలరిస్తున్న సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. (Janaka Aithe Ganaka Review)

కథ:

ప్రసాద్ (సుహాస్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. భార్య (సంగీర్తన)తో ఎంతో ప్రేమగా ఉంటాడు. పెళ్ళయ్యి రెండేళ్లయినా పిల్లలొద్దు అనుకుంటాడు ప్రసాద్. ఈరోజుల్లో పిల్లలంటే ఒక్కొక్కరికి కోటి ఖర్చు అవుతుందని, పిల్లలకు బెస్ట్ ఇవ్వలేనప్పుడు కనకూడదు అనేది ప్రసాద్ పాలసీ. భార్య కూడా అతని మాటకు ఎదురు చెప్పదు. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. అదేంటంటే ప్రసాద్ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. తాను వాడుతున్న కండోమ్స్ నాణ్యత లేకపోవడం వల్లనే తన భార్య ప్రెగ్నెంట్ అయిందని కోర్టుకెక్కుతాడు ప్రసాద్. కండోమ్స్ కంపెనీ నుంచి కోటి రూపాయల పరిహారం కోరతాడు. మరి ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా? అతనికి కోటి రూపాయల పరిహారం అందిందా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

పిల్లలొద్దు అనుకున్న ఓ మధ్యతరగతి వ్యక్తి, తాను వాడుతున్న కండోమ్స్ నాణ్యత లేకపోవడం వల్లనే తన భార్య ప్రెగ్నెంట్ అయిందని కోర్టుకెక్కడం అనేది కొత్త పాయింట్. ఏ మాత్రం గీత దాటినా బూతు చిత్రం అయిపోతుంది. అలాంటిది ఈ పాయింట్ ని తీసుకొని కుటుంబ కథా చిత్రంగా మలచడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఆ విషయంలో సందీప్‌ రెడ్డి బండ్లని మెచ్చుకోవాలి. అయితే ఓ కొత్త పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు, దానిని అంతే కొత్తగా తెరమీద ప్రజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ఈ పాయింట్ లో అటు కామెడీకి, ఇటు ఎమోషన్ కి ఎంతో స్కోప్ ఉంది. కానీ ఏదీ పూర్తిస్థాయిలో పండలేదు. కామెడీ రిపీట్ అయిపోయింది. ఎమోషన్ కూడా అంతగా పండలేదు. ఓ మధ్యతరగతి వ్యక్తి కండోమ్ కంపెనీ మీద కేసు వేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ విషయంలో కథానాయకుడికి, కుటుంబ సభ్యుల మధ్య బలమైన సంఘర్షణ చూపించవచ్చు. కానీ ఇందులో ఆ సంఘర్షణ అంత బలంగా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సన్నివేశాలను ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది. అలాగే కోర్టు రూమ్ డ్రామా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చట్ట పరంగా కథానాయకుడికి ఎన్నో చిక్కుముడులు ఎదురై, అసలు కేసు గెలుస్తాడా లేదా? అనే ఉత్కంఠను కలిగించగలగాలి. కానీ అలాంటి ఉత్కంఠ కలగదు. చాలా సాదాసీదాగా కోర్టు రూమ్ డ్రామా నడుస్తుంది. కొన్ని సీన్స్ అయితే లాజిక్ లెస్ గా అనిపించాయి. ఇక ప్రసాద్ భార్య కోర్టుకి వచ్చి సాక్ష్యం చెబితే కేసు పూర్తవ్వడమనేది మరీ సిల్లీగా ఉంది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. అలాగే ఈ రోజుల్లో విద్య, వైద్యం వంటివి ఎంత ఖరీదయ్యాయో సినిమాలో చెప్పిన విధానం బాగుంది. అయితే ఆ విషయాలను మరింత లోతుగా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలా చెప్తే బాగుండేది. 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

మధ్యతరగతి యువకుడు ప్రసాద్ పాత్రలో సుహాస్ చక్కగా ఒదిగిపోయాడు. అయితే ఈ తరహా పాత్రల్లో అతన్ని ఎక్కువగా చూస్తుండటం వల్ల కొత్తదనం కనిపించడంలేదు. సంగీర్తన తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. సాంగ్స్ లో కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కానీ పెద్దగా మెరుపుల్లేవు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఓకే. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. డీఐ లో నాణ్యత లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా…

‘జనక అయితే గనక’ మూవీ స్టోరీ లైన్ కొత్తగా బాగుంది. కామెడీకి, ఎమోషన్ కి మంచి స్కోప్ ఉంది. కానీ అటు పూర్తిస్థాయిలో నవ్వించలేక, ఇటు గుండెని హత్తుకోలేక.. మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది.

రేటింగ్: 2.25/5 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here