ప్రతి ఏడాది రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకను రెండు రాష్ట్రాల అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. ఆరోజు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజుకు మరింత సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. ఆన్‌లైన్‌లోనే కాదు, ఆఫ్‌లైన్‌లోనూ పండగ చేసుకోబోతున్నారు. వారం రోజుల పాటు ప్రభాస్ పుట్టినరోజు పండగ జరగనుంది. లేటెస్ట్ మూవీతోపాటు ప్రభాస్ పాత సినిమాలు కూడా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
ఈనెల 19, 20 తేదీల్లో ‘సలార్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మార్నింగ్ షోస్ కోసం బుక్‌మై షో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే ఎంతో స్పీడ్‌గా ఫుల్ అయిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే సలార్ రిలీజ్ అయి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. పాత సినిమాలు రీరిలీజ్ అయితే బుకింగ్స్ ఆ రేంజ్‌లో ఉంటే ఓకే. కానీ, సలార్‌కి అంత రెస్పాన్స్ రావడం గొప్ప విషయమే. మరోపక్క 22న మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాన్ని దిల్‌రాజు రీరిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రింట్‌ను ఇప్పుడున్న టెక్నాలజీ సాయంతో హై క్వాలిటీతో తీసుకురాబోతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న అతని తొలి సినిమా ఈశ్వర్‌ను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదలైన రెబల్ చిత్రం కూడా అదే రోజున రీరిలీజ్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్‌కి సంబంధించిన అప్‌డేట్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మరో పక్క హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న సినిమా టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈమధ్యకాలంలో ఏ టాలీవుడ్ హీరో బర్త్‌డేకీ ఇన్ని రీరిలీజ్‌లు జరగలేదు. భారీ పాన్ ఇండియా మూవీస్‌తో ఇండియాలోనే టాప్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న ప్రభాస్ పుట్టినరోజు ఇంత స్పెషల్‌గా జరుపుకోవడం అటు ఫ్యాన్స్‌కి, ఇటు మూవీ లవర్స్‌కి సంతోషాన్ని కలిగించే విషయమే.