గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అది కూడా శంకర్‌ ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే మెగా అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. అయితే ఈ సినిమా 2021లో ప్రారంభమైంది. దాదాపు మూడు సంవత్సరాలుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎట్టకేలకు జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు రిలీజ్‌ అయ్యాయి. ఇంకా మూడు పాటలు విడుదల చెయ్యాల్సి ఉంది.

ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని ఆమధ్య విడుదలైన ‘భారతీయుడు2’ డిజాస్టర్‌ కావడంతో ఆ ప్రభావం ‘గేమ్‌ ఛేంజర్‌’పై పడుతుందనే అభిప్రాయం అందరికీ కలిగింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కుల అమ్మకం విషయంలో ఇటీవల సోషల్‌ మీడియాలో రచ్చ జరిగింది. అదేమిటంటే ఈ సినిమా ఓటీటీ హక్కులు రూ.50 కోట్లకు అమ్మారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంత తక్కువ రేటుకి ఓటీటీ హక్కులు వెళ్ళాయంటే చరణ్‌ రేంజ్‌ ఏమిటో అర్థం చేసుకోవాలని కొందరు కామెంట్స్‌ కూడా పెట్టారు. ఈ వ్యవహారం అంతా యాంటీ ఫ్యాన్స్‌ పనేనని తెలుస్తోంది. బాలీవుడ్‌కి చెందిన ఒక ట్విట్టర్‌ ఎకౌంట్‌ నుంచి ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం ఓటీటీ రైట్స్‌ రూ.50 కోట్లకు అమ్ముడు పోయాయని, దానికి సంబంధించి అగ్రిమెంట్‌ చేయబోతున్నారనే ట్వీట్‌ బయటికి వచ్చింది. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అమెజాన్‌ ప్రైమ్‌ కొన్ని నెలల క్రితమే ‘గేమ్‌ ఛేంజర్‌’ రైట్స్‌ తీసుకుంది. అయితే తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన రైట్స్‌ మాత్రమే అమెజాన్‌ తీసుకుంది. దాదాపు రూ.110 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. మరోపక్క రూ.50 కోట్లకు అగ్రిమెంట్‌ చెయ్యబోతున్నారనే వార్త వచ్చింది. వాస్తవానికి అది హిందీ వెర్షన్‌కి సంబంధించిన రైట్స్‌ అని తెలుస్తోంది. బయటికి వచ్చిన ట్వీట్‌లో హిందీ వెర్షన్‌ మాత్రమే అని స్పష్టం చేయకపోవడం వల్ల ఈ కన్‌ప్యూజన్‌ వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందరికీ అందుతోంది. ‘భారతీయుడు2’ డిజాస్టర్‌ అయినప్పటికీ దాని ప్రభావం ‘గేమ్‌ ఛేంజర్‌’పై పడే అవకాశం లేదు. ఎందుకంటే శంకర్‌ సినిమాలంటే ప్రేక్షకుల్లో వున్న క్రేజ్‌ అలాంటిది. అందులోనూ చరణ్‌తో శంకర్‌ చేస్తున్న మొదటి సినిమా కావడంతో బిజినెస్‌పరంగా ఫిగర్స్‌ బాగానే ఉంటాయి. బయ్యర్స్‌ కూడా ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు. సినిమా రిలీజ్‌కి దాదాపు మూడు నెలల సమయం ఉంది. ఇక ప్రమోషన్స్‌ను స్పీడప్‌ చెయ్యాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దీపావళికి ‘గేమ్‌ ఛేంజర్‌’కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేసే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here