“ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం సీఎం చంద్రబాబు” అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయన్నారు. బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందన్నారు. ప్రజలు నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని విమర్శలు చేశారు.