ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అనేది అనేక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువవుతోంది. అయితే ఒక్కప్పుడు సినిమా తప్ప మరో సాధనం ప్రజలకు అందుబాటులో లేదు. సినిమాలు వృద్ధిలోకి రాకముందు నాటకాలు వినోదాన్ని అందిస్తూ వచ్చాయి. ఒకప్పుడు ప్రేక్షకులు నాటకాలు చూసేవారు, ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కళారంగంలో ఉన్నవారికి విలువ ఉండదు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా నటీమణులకు గౌరవం తక్కువగా లభించేది. అలాగే నటులకు కూడా ఈ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తేవి. వారికి పెళ్ళి కావడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. సినిమాల్లో పనిచేసేవారు వ్యసనపరులనే అపవాదు వున్న కారణంగా వారికి పిల్లనిచ్చేవారు కాదు. ఈ విషయాన్ని ఎంతో మంది నటులు బాహాటంగా వ్యక్త పరిచారు.
ప్రస్తుతం మనం వింటున్న మాట క్యాస్టింగ్ కౌచ్. ఇది సినిమా పుట్టినప్పటి నుంచీ ఉంది. కాకపోతే అప్పుడు మీడియా విస్తృతంగా లేకపోవడం వల్ల అన్ని విషయాలూ బహిరంగం అయ్యేవి కావు. కానీ, ఇప్పుడలా కాదు, ఏ చిన్న విషయం జరిగినా అది మీడియాలోకి వచ్చేస్తోంది. ఈమధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్‌కి సంబంధించిన ఎన్నో వార్తలు మనం విన్నాం. వాటి బారిన పడిన కొందరు తెరపైకి వచ్చి తమకు జరిగిన అన్యాయాల్ని వివరిస్తున్నారు. మరోపక్క మీడియా తమ ప్రాభవాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుండడంతో కొందరు నటీనటులు ఆ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నటీమణులను అడిగే కొన్ని ప్రశ్నలు వారిని ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ళకు అలాంటి అనుభవం ఎదురైంది.
‘పొట్టేల్’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో అనన్య కొన్ని ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఒక మీడియా ప్రతినిధి.. అగ్రిమెంట్లు, కమిట్మెంట్లు వంటి ప్రస్తావన తెచ్చినపుడు దానికి తగ్గట్టుగానే ఘాటుగా సమాధానమిచ్చింది అనన్య. ఈ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఆ లేడీ జర్నలిస్టును విపరీతంగా ఆడుకున్నారు. ఆమెపై స్ట్రాంగ్‌గా కామెంట్స్ పెట్టారు. అనన్యను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. ఇటీవల జరిగిన ‘పొట్టేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు అనన్య.
‘హీరోయిన్లు మేకప్ వేసుకుంటారనే చులకన భావం నుంచి అందరూ బయటికి రావాలి. హీరోయిన్లు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని మాకు మనసు అనేది ఉండదని అనుకోకండి. మాక్కూడా మనసుంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, అనుబంధాలు, ఆప్యాయతలూ ఉంటాయి. మేమూ మీలాంటి మనుషులమే. మాక్కూడా రెస్పెక్ట్ ఇవ్వండి’ అంటూ మనసులోని బాధను అందరితోనూ పంచుకున్నారు అనన్య నాగళ్ళ.