పట్టా భూముల్లో ఇసుక తవ్వుకునే వెసులుబాటు
ఉచిత ఇసుక విధానంలో సీనరేజి, జీఎస్టీ ఛార్జీల రద్దుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీనరేజి ఛార్జీల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.264 కోట్ల మేర భారంపడుతుందని అధికారులు అంచనా వేశారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన లక్ష్యం నెరవేర్చేందుకు ఈ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పట్టా భూముల్లో యజమానులు ఎవరి ఇసుక వారు తవ్వుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉచిత ఇసుక విధానం సరిగ్గా అమలు అయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో డీలర్లను నియమించి ధరల నియంత్రణ చేపట్టాలన్నారు. దేవాలయాల కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించి, సభ్యుల సంఖ్య పెంచేందుకు చట్ట సవరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.