హైదరాబాద్‌లోని అతి పెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిలింసిటీ. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇది కాక అన్నపూర్ణ, సారధి, పద్మాలయా, రామానాయుడు, రామకృష్ణా, అల్లు స్టూడియో.. ఇలా సినిమాల నిర్మాణానికి అనేక స్టూడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నందమూరి బాలకృష్ణ ఓ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారన్నది వార్త. బాలకృష్ణ ఏపీలోని హిందూపూర్‌ ఎమ్మెల్యే. అక్కడ కూటమి అధికారంలో ఉంది. అయినప్పటికీ తెలంగాణలోనే స్టూడియో నిర్మించాలని బాలకృష్ణ భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌.. బాలయ్యకు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిందని తెలుస్తోంది. స్టూడియో నిర్మాణానికి 500 ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ భూ కేటాయింపుల ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సమాచారం. 

శనివారం జరిగే కేబినెట్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగర శివారు ప్రాంతంలో ఈ స్టూడియోకు భూమి కేటాయించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కేబినెట్‌ సమావేశం తర్వాత ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోల నిర్మాణం కోసం స్థలాలు కేటాయిస్తామని వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో బాలయ్యకు జగన్‌ ప్రభుత్వం 500 ఎకరాల భూమి ఇవ్వబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ఇప్పుడు తెలంగాణలో బాలకృష్ణ స్టూడియో నిర్మిస్తారని వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. 

నందమూరి తారక రామారావు 1976లో రామకృష్ణా సినీ స్టూడియోస్‌ను నిర్మించారు. ‘దానవీరశూర కర్ణ’ చిత్రంతో ఈ స్టూడియో ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు అక్కడ షూటింగ్‌లు జరిగాయి. ఎక్కువగా ఎన్టీఆర్‌, బాలకృష్ణ నటించిన సినిమాల షూటింగ్స్‌ మాత్రమే అక్కడ జరిగేవి. పాతిక సంవత్సరాలుగా అక్కడ షూటింగ్స్‌ జరగడం లేదు. బాలకృష్ణకు స్టూడియో నిర్మించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే త్వరలోనే అది కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here