మహిళలు పాడి పరిశ్రమలపై దృష్టి సారించి ఆదాయం సంపాదించేలా స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. కుటుంబంలో తండ్రి వ్యవసాయం ద్వారా ఆదాయం సమకూరిస్తే, తల్లి పాడి పశువుల ద్వారా కొంత ఆదాయం సంపాదించి కుటుంబం మెరుగైన జీవనం సాగించేందుకు సహాయపడుతుందని, ఇటువంటి అనేక ఉదాహరణలు మనందరికీ తెలుసని వివరించారు. కుటుంబం దగ్గర డబ్బులు ఉంటే పిల్లలను మంచి చదువులు చదివిస్తారని, చదువుకున్న పిల్లలు కుటుంబాల స్థితిగతులను పూర్తిగా మారుస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మహిళలకే పాడి పశువులు అందించి, పాల సేకరణ నుంచి ప్యాకింగ్, బై ప్రోడక్ట్ (వెన్నె, మజ్జిగ, పెరుగు, నెయ్యి, స్వీట్స్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేసి లాభాలు పొంది మహిళలు పంచుకోవాలనే కలతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి భూమి పూజ కూడా చేశామని, ప్రత్యేక రాష్ట్ర విభజన ఉద్యమాలు, గత ప్రభుత్వం మహిళల పట్ల ఆలోచన లేకుండా ఈ డెయిరీని పక్కన పడేసిందని అన్నారు.