తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రిత్విక్, సాయికుమార్, రాంకీ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సచిన్ ఖేడేకర్, శ్రీనాథ్ మాగంటి, హైపర్ ఆది, అనన్య, గాయత్రి భార్గవి, మాణిక్ రెడ్డి తదితరులు 

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

డీఓపీ: నిమిష్ రవి

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: బంగ్లాన్

రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిర్మాతలు: ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య

బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌

విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024

తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఇతర భాషల నటుల్లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒకరు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన, ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ అనే మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగులో దుల్కర్ కి హ్యాట్రిక్ ని అందించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Lucky Baskhar Movie Review)

కథ:

ముంబైలో నివసించే మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ (దుల్కర్ సల్మాన్) ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంటెంట్ గా పని చేస్తుంటాడు. చాలీచాలని జీతం, తీర్చలేని అప్పులతో కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది పడుతుంటాడు. డబ్బు లేకపోవడంతో అయినవాళ్ళు కూడా చులకనగా చూస్తారు. ప్రమోషన్ వస్తే జీతం పెరిగి, జీవితం కొంత మెరుగు పడుతుంది అనుకుంటే.. ఆ ప్రమోషన్ కూడా చేజారిపోతుంది. దురదృష్టం వెంటాడుతూ, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. వేరే దారి లేక, అడ్డ దారిలో డబ్బు సంపాదించడం కోసం ఆంథోనీ (రాంకీ) అనే వ్యక్తితో చేతులు కలుపుతాడు. మొదట అవసరం కోసం డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత అది వ్యసనంలా మారుతుంది. అసలు భాస్కర్ డబ్బు ఎలా సంపాదించాడు? ఎవరినీ ముంచకుండా, కేవలం బ్యాంక్ ని అడ్డుపెట్టుకొని స్కాంలు చేసి ఎలా కోటీశ్వరుడు అయ్యాడు? స్టాక్ మార్కెట్ కింగ్ హర్ష మెహ్రా చేసిన బ్యాంకింగ్ స్కాం ఏంటి? దానికి భాస్కర్ కి సంబంధమేంటి? కోటీశ్వరుడు అయ్యాక భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పులేంటి? డబ్బు అతనికి నేర్పిన పాఠాలేంటి? డబ్బుతో ఆడిన జూదంలో గెలిచి, చివరికి భాస్కర్ ‘లక్కీ భాస్కర్’ అనిపించుకున్నాడా లేదా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఇది భాస్కర్ కథ. డబ్బుల్లేక ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురుకావడంతో.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకొని సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఒక మధ్య తరగతి వ్యక్తి కథ. ఇలాంటి సినిమాలకు కథానాయకుడి పాత్రే కీలకం. కథానాయకుడి పాత్రను మలిచిన తీరు, ఆ పాత్ర చుట్టూ అల్లుకునే సన్నివేశాలు, ఆ సన్నివేశాలను కలుపుతూ కథానాయకుడి పాత్రను నిలబెట్టే కథనం.. ఇవే సినిమాని నిలబెడతాయి. లక్కీ భాస్కర్ లో కథానాయకుడి పాత్రను మలిచిన తీరు బాగుంది. ఆ పాత్రను పరిచయం చేస్తూ రాసుకున్న సన్నివేశాలు కూడా బాగున్నాయి. కానీ మనల్ని మనం మర్చిపోయి పూర్తిగా ఆ పాత్రతో ప్రయాణం చేసే, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తించే.. కథనం తోడవ్వలేదు.

ఒక సాధారణ బ్యాంక్ అకౌంటెంట్ అయిన భాస్కర్ అకౌంట్ లో కోట్ల రూపాయిల డబ్బు ఎలా ఉందని, సీబీఐ ఎంక్వయిరీతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి భాస్కర్ ప్రయాణాన్ని చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. భార్య, కొడుకు, తండ్రి, తమ్ముడు, చెల్లి.. ఇలా కుటుంబంలోని అందరి బాధ్యత భాస్కర్ పైనే ఉంటుంది. తనకు బ్యాంక్ లో వచ్చే జీతం సరిపోక, అప్పులు చేస్తూ.. అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంక్ లో స్కాం చేయడం మొదలుపెడతాడు. వేలతో మొదలైన సంపాదన లక్షల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. అతను ఎదిగే క్రమం ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఒక మంచి హై ఇస్తుంది. 

ఫస్ట్ హాఫ్ లో లక్షల్లో ఉన్న భాస్కర్ సంపాదన, సెకండ్ హాఫ్ లో కోట్లలోకి వెళ్తుంది. బ్యాంక్ ని, స్టాక్ మార్కెట్ ని ముడిపెడుతూ భారీ స్కాం ని చూపిస్తారు. హర్షద్ మెహతాను గుర్తుచేసే హర్ష మెహ్రా పాత్ర ప్రధానంగా సెకండాఫ్ నడుస్తుంది. ఓ రకంగా ఇది ‘స్కామ్ 1992’ సిరీస్ కి మరో కోణంలా ఉంటుంది. అయితే ఆ సిరీస్ చూసినవారికి ఈ సెకండాఫ్ అంత గొప్పగా అనిపించకపోవచ్చు. పైగా భాస్కర్ పాత్ర చివరికి ఎలాగూ గెలుస్తుందని, చూసే ప్రేక్షకులకు తెలుసు. అలాంటప్పుడు అతని ప్రయాణాన్ని ఎంత ఆసక్తికరంగా చెబితే అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. లక్కీ భాస్కర్ అని టైటిల్ పెట్టాం కాబట్టి, లక్కీగా అతనికి అన్ని అనుకూలంగా జరుగుతున్నట్టుగా ఉండకూడదు. ఎంత అతనికి తెలివితేటలు ఉన్నప్పటికీ, విప్పలేని చిక్కుముడులు ఎదురవ్వాలి, భాస్కర్ దొరికిపోతాడేమో అనే ఆందోళన ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కలగాలి, క్లిష్టమైన చిక్కుముడులు అన్నింటిని దాటుకొని చివరికి భాస్కర్ గెలవాలి. అప్పుడు చూసే ప్రేక్షకులకు కిక్ వస్తుంది. ఆ కిక్ ని లక్కీ భాస్కర్ పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయింది. పతాక సన్నివేశాలు బాగున్నాయి కానీ, అందుకు తగ్గట్టుగా దానికి ముందు వచ్చే సన్నివేశాలను కూడా అంతే పగడ్బందీగా, మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నట్లయితే.. అవుట్ పుట్ మరోస్థాయిలో ఉండేది.

దర్శకుడు వెంకీ అట్లూరి ప్రయత్నం బాగుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయన ఎంతో రీసెర్చ్ చేశాడని అర్థమవుతోంది. అయితే కథనాన్ని ఇంకా మెరుగ్గా రాసుకొని, సినిమాని మరింత ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. సంభాషణలు బాగున్నాయి. నిమిష్ రవి కెమెరా పనితనం ఆకట్టుకుంది. కథకి తగ్గట్టుగా మనల్ని 80-90ల లోకి తీసుకెళ్లాడు. బంగ్లాన్ ఆర్ట్ వర్క్ బాగుంది. 80ల నాటి బొంబాయి(ముంబై)ని అద్భుతంగా సృష్టించాడు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఇలా కథానాయకుడి పాత్ర ప్రధానంగా సాగే సినిమాలకు ఎడిటింగ్ కీలకం. ఆ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి తన పని తాను బాగానే చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

భాస్కర్ పాత్రలో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేం అనే అంతలా దుల్కర్ సల్మాన్ మ్యాజిక్ చేశాడు. నటించినట్లుగా కాకుండా, సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు మెప్పించింది. ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగ్స్ లేనప్పటికీ.. ఆ పాత్రకి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ తనదైన హావభావాలు, ముఖ కవళికలతో హీరోయిజాన్ని చక్కగా ప్రదర్శించాడు. భాస్కర్ భార్య సుమతిగా మీనాక్షి చౌదరికి మంచి పాత్రే లభించింది. డబ్బులేనప్పుడు పుట్టింటి అవమానాలను తట్టుకొని భర్తకి అండగా, డబ్బులొచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు చూసి బాధపడే భార్యగా ఆమె నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. భాస్కర్ పార్టనర్ గా రాంకీ, ఫ్రెండ్ గా రాజ్‌కుమార్ కసిరెడ్డి వారి పాత్రలకు న్యాయం చేశారు. భాస్కర్ కొడుకుగా రిత్విక్, సీబీఐ ఆఫీసర్ గా సాయికుమార్, సచిన్ ఖేడేకర్, శ్రీనాథ్ మాగంటి, హైపర్ ఆది, అనన్య, గాయత్రి భార్గవి, మాణిక్ రెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా…

తెలుగులో బ్యాంకింగ్ నేపథ్యంలో సినిమాలు రావడం అరుదు. ఆ పరంగా చూస్తే, లక్కీ భాస్కర్ మూవీ కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు, కథనం విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. కథాంశం కోసం, భాస్కర్ పాత్ర కోసం, భాస్కర్ పాత్రను పోషించిన దుల్కర్ సల్మాన్ కోసం ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు. 

రేటింగ్: 2.75/5 

– గంగసాని


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here