సర్వేకు సహకరించండి… కలెక్టర్
ఇంటింటా సమగ్ర సర్వే కు ప్రతి ఒక్కరు సహకరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎవరికీ వెల్లడించమని స్పష్టం చేశారు. సర్వేలో ప్రజలు ఇచ్చే వివరాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్యూమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ,ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని, అందువలన తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సర్వేకు ప్రభుత్వం రూపొందించిన 75 కాలమ్స్ లో వివరాల సేకరణ చేస్తారని, ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేటర్లకు అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సూపర్వైజర్లు, లేదా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. సర్వే ఫారంలో పూర్తి వివరాలను నింపాలని, ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను ఆన్ లైన్ చేస్తామని తెలిపారు.