ఒక సినిమా విజయంలో మ్యూజిక్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ సినిమాని ఎంత గొప్పగా తీసినా, దానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరితేనే ఆ సీన్స్‌లోని ఎమోషన్ కరెక్ట్‌గా క్యారీ అవుతుంది. అలాగే సిట్యుయేషన్‌కి తగ్గట్టు వచ్చే పాటలు సినిమాకి మరింత వన్నె తీసుకొస్తాయి. సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మధురమైన పాటల్ని అందించారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా చివరి వరకూ అందులోనే కొనసాగారు తప్ప మిగతా శాఖల జోలికి వెళ్లలేదు. కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని బ్రేక్ చేస్తూ టి.రాజేందర్, ఎస్.వి.కృష్ణారెడ్డి వంటి వారు డైరెక్షన్‌తోపాటు సంగీతాన్ని కూడా అందించేవారు. కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరో అవ్వడం అనేది అప్పట్లో లేదు.
విజయ్ ఆంటోని సంగీతం అందిస్తూనే హీరోగా సినిమాలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా నకిలీ ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. విజయ్ ఆంటోని బాటలో మరో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇతను ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో సంగీత దర్శకుడు 100 సినిమాలు పూర్తి చెయ్యడం అనేది సాధారణ విషయం కాదు. కానీ, జి.వి.ప్రకాష్ ఆ ఘనత సాధించబోతున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మ్యూజిక్ డైరెక్టర్‌గా 100 సినిమాలు పూర్తి చేసి రికార్డు సృష్టించబోతున్నారు జి.వి.ప్రకాష్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎ.ఆర్.రెహమాన్, హేరిస్ జయరాజ్, యువన్ శంకర్‌రాజా, దేవిశ్రీప్రసాద్, తమన్, అనిరుధ్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ సంగీతంలో తన స్పెషాలిటీ ఏమిటో చూపించుకొని జి.వి.ప్రకాష్ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా విశేషమే. తన ప్రతి సినిమాలోనూ సూపర్‌హిట్ సాంగ్స్ ఉంటాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తాడు. గత వారం విడుదలైన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్. నవంబర్ 14న విడుదల కాబోతున్న వరుణ్‌తేజ్ కొత్త సినిమా ‘మట్కా’కి కూడా జి.వి.ప్రకాషే మ్యూజిక్ డైరెక్టర్. ఇదిలా ఉంటే.. జి.వి.ప్రకాష్ 100వ సినిమా ఫిక్స్ అయింది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకి మ్యూజిక్ చెయ్యడం ద్వారా 100 సినిమాల సంగీత దర్శకుడిగా వార్తల్లోకి ఎక్కబోతున్నారు.
హీరోగా నటిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా 100 సినిమాలు పూర్తి చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం గురించి జి.వి.ప్రకాష్ స్పందిస్తూ ‘నేను హీరోగా నటిస్తున్నప్పటికీ నా ప్రయారిటీ మ్యూజిక్ డైరెక్షన్‌కే ఇస్తాను. అందుకే నెలలో 12 రోజులు మాత్రమే షూటింగ్స్‌లో పాల్గొంటాను. మిగతా టైమ్ మొత్తం మ్యూజిక్ కోసమే కేటాయిస్తాను. ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నానంటే నాకు సంబంధించిన వర్క్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఉండకూడదన్నది నా పాలసీ. అందుకే సినిమా రిలీజ్‌కి వారం ముందే నా వర్క్ పూర్తి చేస్తాను. అందుకే మ్యూజిక్ చేయమని నిర్మాతలు నా దగ్గరికి వస్తారనుకుంటున్నాను’ అంటూ వివరించారు జి.వి.ప్రకాష్‌కుమార్.