నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు

ఎడిటర్: రామకృష్ణ అర్రం

సినిమాటోగ్రఫీ: వి. ఎస్. జ్ఞాన శేఖర్

సంగీతం: గోపి సుందర్

నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి

దర్శకత్వం: విరించి వర్మ

విడుదల తేదీ: నవంబర్ 8, 2024 

బయోపిక్ లు, యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల కి చెందిన నాయకుడు దివంగత జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో ఆకట్టుకున్న విరించి వర్మ దర్శకుడు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Jithender Reddy Review)

కథ:

జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) కుటుంబం ముందు నుంచి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు. దేశం కోసం, ధర్మం కోసం అహోరాత్రులు పనిచేసే కుటుంబం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలకు ఆకర్షితుడవుతాడు. దేశం కోసం, ప్రజలు కోసం ఏదైనా చేయాలనుకునే తపన పడుతుంటాడు. చిన్నప్పుడు ఓ కుర్రాడిని అన్యాయంగా నక్సలైట్స్ హత్య చేస్తారు. ఈ సంఘటనతో కామ్రేడ్స్ పై రగిలిపోతాడు జితేందర్ రెడ్డి. భూమి కోసం, పీడిత ప్రజల బాగు కోసం గన్నులు చేత పట్టినట్టు చెప్పుకునే నక్సలైట్స్ దారితప్పినట్టు తెలుసుకుంటాడు. ఆ తర్వాత కామ్రేడ్స్ పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేసాడనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

స్వయంసేవకుల బయోపిక్స్ తెరకెక్కడం చాలా అరుదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వయంసేవకులుగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ అత్యున్నత పదవులు అందుకున్నారు. ఇలాంటి వాళ్లు పదవులు అందుకోవడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పాత్ర మరవలేనది. అలాంటి స్వయంసేవకుడి కథే ‘జితేంద్ర రెడ్డి’ కథ. 

తెలుగు తెరపై కామ్రేడ్స్ ను హీరోలుగా చూపిస్తూ ఎక్కువగా సినిమాలు తెరకెక్కాయి. అయితే అన్నింట్లో చీకటి కోణాలు ఉన్నట్టే, నక్సలిజంలో కూడా చీకటి కోణాలు ఉంటాయని చూపించే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన సినిమానే ‘జితేంద్ర రెడ్డి’. ఇలాంటి కథలను తెరకెక్కిండం అంటే మాములు విషయం కాదు. ఎంతో ధైర్యం ఉండాలి. ఆ పరంగా దర్శకనిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. పీడిత వర్గాల కోసం గన్నులు పట్టిన అన్నలు.. ఆ పీడిత వర్గాలనే ఎదగకుండా చేసారు. అంతేకాదు ప్రభుత్వం చేపట్టే ప్రగతికి అడ్డుగా నిలిచారు వంటి విషయాలను దర్శకుడు విరించి వర్మ.. తెరపై ఆవిష్కరించాడు. జితేందర్ రెడ్డి పాత్రను మలిచిన తీరు, కామ్రేడ్స్ పై ఆయన సాగించిన పోరాటం ఆకట్టుకున్నాయి. కథాకథనాలు బాగున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగింది. ఇక సాంగ్స్ కూడా కథ ఫ్లోని డిస్టర్బ్ చేయడమే కాకుండా, బోర్ కొట్టించాయి. అలాగే ఇది ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడి కథ కావడంతో.. ఒక వర్గం ప్రేక్షకులకే నచ్చే అవకాశాలున్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చక్కగా ఒదిగిపోయాడు. తనదైన బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నక్సలైట్ లీడర్ గా ఛత్రపతి శేఖర్ నటన బాగుంది. రియా సుమన్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

వి. ఎస్. జ్ఞాన శేఖర్ కెమెరా పనితనం బాగుంది. గోపి సుందర్ సంగీతం పరవాలేదు. ఎడిటర్  రామకృష్ణ అర్రం కత్తెరకు మరింత పని చెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే…

ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మెప్పించింది.

రేటింగ్: 2.75/5

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here