అల్పపీడనం వర్షాలు
అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, సరిహద్దులోని దక్షిణ ఏపీలోని తీర ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.