కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టే వారిలో ఎక్కువ మంది మండల కాలం అంటే 41రోజుల పాటు దీక్ష చేస్తారు. మరికొందరు అర్థమండల దీక్ష అంటే 21రోజుల పాటు దీక్షలో పాల్గొంటారు. దీక్షలో ఉన్నంత కాలం మాల ధరించిన వ్యక్తిని స్వామిగా భావిస్తారు. అంటే దేవుడితో సమానమని అర్థం. అందుకే ఈ 41 రోజులూ వారు అన్ని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. ఉదయం, సాయంత్రం పూట చల్లటి నీటి స్నానాలు చేయాలి. జుట్టు, గోర్లు కత్తిరించడం, రంగుల రంగుల బట్టలం వేయడం చేయరాదు. మాలధారణ సమయంలో కేవలం నల్లటి దుస్తులను మాత్రమే ధరించాలి. కాలికి చెప్పులు కూడా వేసుకోకూడదు. సరళమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. మాంసాహారం తినడం, శృంగారంలో పాల్గొనడం, ధూమపానం చేయడం, మద్యం సేవించడం వంటి వాటిని మలధారణ సమయంలో చేయడం పెద్ద పాపంగా భావిస్తారు. అంత్యక్రియలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అంతే కాదు తిట్టడం, గొడవపడటం, ఇతరులను అవమానించడం ఈ సమయంలో వారు చేయకూడదు.