హిందూ ఆచారాల ప్రకారం గంట కొట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది. గంటను కొట్టినప్పుడు వెలువడే ధ్వని చాలా ఘనంగా, లోతుగా, నిరంతరాయంగా వినిపిస్తుంది. ఇది ఆదిశబ్దమైన ఓంకారాన్ని సూచిస్తుంది. గుడికి వచ్చిన వారిలో లేదా ఇంట్లో పూజ చేసుకునే వారిలో ఇతర శబ్దాలు భక్తి చింతనకు, ఏకాగ్రతకు, అంతర్గత శాంతికి భంగం కలిగిస్తాయి. దైవారాధన సమయంలో గంటను మోగించడం వల్ల, లేదా ఆ శబ్దాన్ని వినడం వల్ల భక్తుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ గంటాధ్వని క్షణక్షణానికి మనస్సులో కలిగే రకరకాల ఆలోచనలు, ఆందోళనల నుంచి దూరంగా ఉంచుతుంది. దైవ సన్నిధికి వచ్చామని పదేపదే గుర్తు చేసి భక్తిపై మనస్సు లగ్నమయ్యేలా ప్రేరేపిస్తుంది. ఆలయంలో శంఖారావాలు, దీపాలు, సువాసనలు, ఆహార నైవేద్యాలు ఇవన్నీ కలిసి పరిపూర్ణ ఆధ్మాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.