భారతదేశంలో ప్రాచీన కాలాన ప్రతి కుటుంబానికి పాడి పశువులే సంపద. గోవులు ఎక్కువ ఉన్నవారిని సంపన్నులుగా భావించేవారు. వాటిని పోషించడానికి, సంరక్షించడానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చేంది. అమితమైన గో సంపదను తీసుకుని వెళ్లే సమయంలో గోవుల సమూహాలకు గుర్తింపు కోసం పేర్లు పెట్టేవారు. మందలలోని గోవులు ఇతర మందలలో కలిసిపోయినప్పుడు గో కాపరుల మధ్య వివాదాలు తలెత్తేవి. ఆ గొడవలను తపోనిష్టులైన గోత్ర పాలకులు తీర్చేవారు. కాలక్రమేణా ఆ గోత్ర పాలకుల పేర్లే గోత్ర నామాలుగా పేరు తెచ్చుకున్నాయి. ముందుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు మాత్రమే గోత్ర నామాలుండేవి. తొలి నాళ్లలో ఉన్న గోత్ర నామాలు అత్రి, జమదగ్ని, అగస్త్య, విశ్వామిత్రా గోత్రాలు మాత్రమే. ఆ తర్వాత మిగిలిన వారంతా కులాల వారీగా గోత్ర నామాలను ఏర్పరచుకున్నారు. వారి వంశానికి మూల పురుషులైన వారి పేర్లనే గోత్ర నామాలుగా పెట్టుకున్నారు. ఫలితంగా ఆయా వంశీకులు వారి మూల పురుషుల పేర్లను యజ్ఞ యాగాలలో తలచుకుంటుంటారు. సగోత్రికులంతా ఒకే రుషికి పుట్టిన వాళ్లన్న మాట. వివాహ సంబంధమైన విషయాల్లో వీటిని బట్టే సగోత్రికులా కాదా అనే నిర్ధారణకు వస్తారు. ఒకవేళ అమ్మాయి, అబ్బాయి సగోత్రికులైతే వారిని ఒకే తండ్రికి పుట్టిన అన్నా చెల్లెళ్లు కింద పరిగణిస్తారు. సాధారణ సందర్భాల్లోనూ సగోత్రికులైన మగవారు తారసపడితే వారిని అన్నగానో, తమ్ముడిగానో భావిస్తుంటారు.