ఇన్నర్ రింగ్ రోడ్డుకు రూ.80 కోట్లు

వరంగల్ నగరం చుట్టూ దాదాపు 40 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ మేరకు గతంలోనే కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) ప్రతిపాదనలు తయారు చేసింది. కాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారి(ఎన్హెచ్–163)కి బైపాస్ గా దాదాపు 19 కిలోమీటర్ల మేర నగర శివారులోని కరుణాపురం నుంచి ఆరెపల్లి వరకు 2020లోనే రోడ్డు పూర్తి చేశారు. ఇంకో రెండు వైపులా రోడ్డు పూర్తయితే వరంగల్ కు పూర్తి స్థాయిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పడే అవకాశం ఉండగా.. కుడా ఆధ్వర్యంలో మొదటి దశలో ఖమ్మం రూట్ లోని నాయిడు పెట్రోల్ బంక్, వసంతపూర్, స్తంభంపల్లి, ఖిలా వరంగల్, జాన్ పీరీల వరకు దాదాపు 8 కిమీల మేర చదును చేసి పనులు చేపట్టారు. ఆ మార్గంలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉండటంతో దాదాపు రూ.113 కోట్ల వరకు పరిహారంగా చెల్లించి పనులు స్టార్ట్ చేశారు. ఇక రెండో దశలో జాన్ పీరీల నుంచి కీర్తినగర్, కోటి లింగాల, ఏనుమాముల, కొత్తపేట నుంచి ఆరెపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర కనెక్ట్ కావాల్సి ఉండగా.. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. భూములు కోల్పోతున్న వారికి పరిహారం కోసం రూ.50 కోట్లు అంచనా వేయగా.. రైతులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. సర్వేల కోసం వెళ్లిన అధికారులను అడ్డుకుంటున్నారు. దీంతోనే భూనిర్వాసితులకు పరిహారం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.30 కోట్లు అదనంగా పెంచి, మొత్తంగా రూ.80 కోట్లు రింగ్ రోడ్డు కోసం రిలీజ్ చేసింది. దీంతో తొందర్లోనే ఈ పనులు కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here