మండల కేంద్రం దాటితే టోల్ వసూలు
ఔట్సోర్సింగ్ విధానంలో రోడ్ల నిర్మాణం అంశంపై ప్రజాప్రతినిధులు ప్రజలను ఒప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విధానానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారో చెప్పాలంటే ఎక్కువ మంది సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ చేతులు ఎత్తారు. అయితే బలవంతంగా కొత్త విధానాన్ని అమలుచేయబోమన్నారు. కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తామని, అయితే అన్ని వాహనాలకు టోల్ ఉండదని స్పష్టం చేశారు. కేవలం కార్లు, లారీలు, బస్సుల వంటి భారీ వాహనాలకు టోల్ వసూలు చేస్తారన్నారు. ఆటో, బైక్, ట్రాక్టర్లకు ఎలాంటి టోల్ ఉండదన్నారు. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు టోల్ ఉండదని, మండల కేంద్రం దాటిన తర్వాత మాత్రమే టోల్ వసూలు చేస్తారన్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన రోడ్లు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మారతాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఇదొక భాగమన్నారు. ప్రజలను ఒప్పించిన తర్వాత మాత్రమే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.