రోజుకు 2500 వీసాలు ప్రాసెస్
ఈ వివరాలను హైదరాబాద్లోని యూఎస్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్, మరో అధికారి అలెగ్జాండర్ మెక్లారెన్ మంగళవారం విశాఖ పర్యటనలో మీడియాకు తెలిపారు. 2023లో భారతదేశం నుంచి దాదాపు 3.3 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లగా…వీరిలో దాదాపు 1.8 లక్షలు ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఉండవచ్చన్నారు. భారతదేశంలో యూఎస్ వీసాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని యూఎస్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. గత సంవత్సరం 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశామన్నారు. దేశంలోని మరే ఇతర కాన్సులేట్ ఇన్ని వీసాలు ప్రాసెస్ చేయలేదన్నారు. గత ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ సిబ్బంది రెండింతలు పెరిగారన్నారు. 2025 నాటికి వీరి సంఖ్య మూడు రెట్లు అవుతుందన్నారు. తాము రోజుకు 1,600 వీసాలను ప్రాసెస్ చేస్తామన్నారు. ఈ సంఖ్య 2025 జనవరి లేదా ఫిబ్రవరి నాటికి దాదాపు 2,500కి పెరిగే అవకాశం ఉందన్నారు.