‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.. ఇదే నయనతార రూపొందించిన డాక్యుమెంటరీ. నెట్‌ఫ్లిక్స్‌లో మూడు రోజులుగా స్ట్రీమ్‌ అవుతోంది. తను సినిమా రంగానికి ఎలా వచ్చింది, ఏయే సినిమాలు తనకు పేరు తెచ్చాయి, తను స్టార్‌ హీరోయిన్‌ ఎలా కాగలిగింది వంటి అంశాలతోపాటు విఘ్నేష్‌తో తన ప్రేమ వ్యవహారం, అది పెళ్లికి ఎలా దారి తీసింది వంటి విషయాలను ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించింది. ఈ డాక్యుమెంటరీ విషయమై ఇటీవల నయనతార, ధనుష్‌ మధ్య ఓ వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను విఘ్నేష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే విఘ్నేష్‌, నయనతార మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లికి దారి తీసింది. తాను నిర్మించిన డాక్యుమెంటరీలో తన ప్రేమ గురించి చెప్పాలంటే ఆ సినిమా గురించి, ఆ సమయంలో జరిగిన సన్నివేశాల గురించి ప్రస్తావించాలి. అలా చెయ్యాలంటే దానికి సంబంధించిన క్లిప్పింగ్స్‌ అవసరమవుతాయి. అవి తన డాక్యుమెంటరీలో వాడుకోవాలంటే నిర్మాత అయిన ధనుష్‌ పర్మిషన్‌ ఇవ్వాలి. కానీ, ధనుష్‌ దానికి అంగీకరించలేదు. 

అయితే డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత.. తన సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ వాడారని, అందుకే తనకు రూ.10 కోట్లు చెల్లించాలని నయనతారకు లీగల్‌ నోటీస్‌ పంపాడు ధనుష్‌. మూడు సెకన్ల క్లిప్పింగ్‌ వాడినందుకే రూ.10 కోట్లు కట్టాలని ధనుష్‌ నోటీస్‌ పంపాడని నయనతార సీరియస్‌ అయింది. అయితే డాక్యుమెంటరీలో ఆ సినిమాకి సంబంధించి 25 సెకన్ల క్లిప్పింగ్స్‌ వాడినట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నయన్‌పై ఫైర్‌ అవుతున్నారు. అంత నిడివి క్లిప్పింగ్స్‌ వాడినందుకు ధనుష్‌ నీకు నోటీస్‌ పంపించడం, డబ్బు డిమాండ్‌ చేయడం తప్పు కాదు అంటున్నారు. నువ్వు డాక్యుమెంటరీ చేసినందుకు నెట్‌ఫ్లిక్స్‌ నుంచి డబ్బు తీసుకున్నావు కదా అంటూ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా నయనతార తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నేను చేసిన ప్రతి సినిమాలోని క్యారెక్టర్‌ ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. చాలా సినిమాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నవే చేశాను. నా సినీ ప్రయాణం ఎంతో ఆనందంగా సాగింది. అలాంటి అద్భుతమైన జ్ఞాపకాలను నా డాక్యుమెంటరీలో పొందుపరచాలని భావించాను. నేను ఆయా నిర్మాతల అనుమతి కోరినపుడు ఏమీ ఆలోచించకుండా నాకు ఎన్‌ఓసిలు ఇచ్చారు. నేను అడిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుడా ఎన్‌ఓసీలు ఇచ్చిన నిర్మాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు. 

ఈ లెటర్‌ విడుదల చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను రూపొందించిన డాక్యుమెంటరీ చాలా నాసిరకంగా ఉందని కోలీవుడ్‌లో విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు దానికి పబ్లిసిటీ ఇచ్చుకునేందుకే కొత్తగా తన నిర్మాతలు అంటూ అందరికీ లెటర్స్‌ పంపించింది అంటున్నారు. తమిళ్‌, మలయాళ ఇండస్ట్రీలో తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలతోపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీకి చెందిన చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌లకు, కామాక్షి పిక్చర్స్‌కి చెందిన డి.శివప్రసాద్‌రెడ్డికి, శ్రీసాయిబాబా మూవీస్‌కి చెందిన యలమంచిలి సాయిబాబులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  వాస్తవానికి నయనతార నిర్మాతల శ్రేయస్సును ఎప్పుడూ కోరుకోలేదని ఆమెతో సినిమాలు చేసిన నిర్మాతలు కొందరు అంటున్నారు. తను ఏ సినిమా చేసినా షూటింగ్‌ వరకే పరిమితం అయ్యేదని, ఆ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలకు, ప్రెస్‌మీట్స్‌కు, ఫంక్షన్స్‌కు కూడా హాజరయ్యేది కాదనీ, అవన్నీ మర్చిపోయి తన అవసరం కోసం ఇలా అందర్నీ పొగుడుతూ లెటర్‌ పోస్ట్‌ చేసింది అని అందరూ విమర్శిస్తున్నారు. నిర్మాతలను అన్ని ఇబ్బందులకు గురి చేసిన నయనతార ఇప్పుడు వారికి థాంక్స్‌ చెబుతూ లెటర్‌ పోస్ట్‌ చేయడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. 

నిర్మాతల నుద్దేశించి ఈ లెటర్‌ పోస్ట్‌ చేయడం వెనుక మరో కారణం కూడా వుందని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. తనతో సినిమాలు చేసిన నిర్మాతలందరి పేర్లు ప్రస్తావించి ధనుష్‌ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ధనుష్‌ను టార్గెట్‌ చేసింది కాబట్టే అతని పేరును పక్కన పెట్టి మిగతా అందరి పేర్లను ఆ లెటర్‌లో పేర్కొంది. నయనతార ఇదంతా కావాలనే చేస్తోందని, ఈ వివాదం మరింత పెద్దది అయ్యేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here