గూగుల్ ఎయిర్ వ్యూ ఎలా పనిచేస్తుంది?
ఎయిర్ వ్యూ భారత్ లోని ప్రధాన పట్టణ ప్రాంతాలతో సహా 150 కి పైగా నగరాల్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ సెన్సార్ల నెట్ వర్క్ ను ఉపయోగిస్తుంది. పీఎం2.5, పీఎం10, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను కొలవడానికి యుటిలిటీ పోల్స్, వాణిజ్య స్థలాలు, పరిపాలనా భవనాలపై ఈ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇవి ఉష్ణోగ్రత, గాలిలో తేమ వంటి ఇతర వాతావరణ పారామీటర్లను కూడా కొలవగలవు. ఈ సెన్సర్ల ద్వారా సేకరించిన డేటాను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలకు చెందిన పరిశోధకులు పరిశీలించి, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ను ఉపయోగించి విశ్లేషిస్తారు. ఈ సమాచారం మున్సిపల్ అధికారులతో పాటు పౌరులకు అందుబాటులో ఉంటుంది. అర్బన్ ప్లానర్లు కాలుష్య హాట్ స్పాట్ లను గుర్తించడానికి, ప్రాంతాల వారీగా పరిష్కారాలను వెతకడానికి ఈ డేటాను ఉపయోగించవచ్చు.