తారాగణం: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, నరేష్, సునీల్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు

సంగీతం: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి

ఎడిటర్: అన్వర్ అలీ

ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం

రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

నిర్మాత: రామ్ తాళ్లూరి

బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

విడుదల తేదీ: నవంబర్ 22, 2024 

ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో అలరించిన విశ్వక్‌సేన్.. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ అంటూ ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Mechanic Rocky Movie Review)

కథ:

రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) చదువు మధ్యలోనే ఆపేసి, తన తండ్రి రామకృష్ణ(నరేష్) నడుపుతున్న గ్యారేజ్ లో మెకానిక్ గా పని చేస్తుంటాడు. గ్యారేజ్ లో రిపేర్లు చేయడంతో పాటు, డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజ్ ఉన్న స్థలంపై రంకి రెడ్డి (సునీల్‌) కన్నుపడింది. ఆ గ్యారేజ్ ని దక్కించుకోవాలంటే రూ.50 లక్షలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రూ.50 లక్షల కోసం రాకీ ఏం చేశాడు? గ్యారేజ్ ని కాపాడుకోగలిగాడా? అసలు ఈ కథలో ప్రియ (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్దా శ్రీనాథ్) పాత్రలేంటి? రాకీ జీవితంపై ప్రియ, మాయ పాత్రలు ఎలాంటి ప్రభావం చూపాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

విశ్వక్ సేన్ మొదటి నుంచి కథల ఎంపికలో ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తున్నాడు. కానీ ‘మెకానిక్ రాకీ’ ప్రచార చిత్రాలు చూసినప్పుడు మాత్రం ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనే అభిప్రాయం కలిగింది. నిజానికి ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది. మధ్యతరగతి వారి ఆశను ఆసరాగా చేసుకొని జరిగే మోసాలను ఇందులో టచ్ చేశారు. అయితే దాని చుట్టూ అల్లుకున్న కథాకథనాలు రొటీన్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా నడుస్తుంది. ఎప్పుడో రావాల్సిన ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తుంది. పోనీ రొటీన్ గా ఉన్నా కాస్త అయినా ఎంటర్టైనింగ్ గా ఉంటుందా అంటే అదీ లేదు. పాత చింతకాయ పచ్చడి సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఉంటుంది. ట్విస్ట్ లు అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ తో నిరాశచెందిన ప్రేక్షకులు, సెకండ్ హాఫ్ తో కూల్ అవుతారు. సెకండ్ హాఫ్ లో కథనం, సన్నివేశాలు, ట్విస్ట్ లు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు పరవాలేదు.

దర్శకుడు రవితేజ ముళ్లపూడిలో విషయంలో ఉంది. మొదటి సినిమా అయినప్పటికీ అనుభవమున్న దర్శకుడిలా సినిమాని తెరకెక్కించాడు. అయితే రచన విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఒక మంచి పాయింట్ ని చెప్పాలనుకున్నప్పుడు, దానిని ఎంగేజింగ్ గా చెప్పాలని చూడాలి కానీ, అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇరికించే ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ హాఫ్ ని ఏవో ఒక సీన్స్ తో నింపేసి, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లతో హిట్ కొట్టేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఫస్ట్ హాఫ్ కనీసం పరవాలేదు అనేలా ఉంటూనే, సెకండాఫ్ చూడాలనే ఆసక్తి కొంచెమైనా ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకే కేవలం ట్విస్ట్ ల పైనే ఆధారపడకుండా.. దాని చుట్టూ జరిగే కథ, సన్నివేశాలపై కూడా దృష్టి పెట్టాలి.

సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన జేక్స్ బిజోయ్, నేపథ్య సంగీతంతో మెప్పించాడు. చాలా సీన్స్ ని తన సంగీతంతో నిలబెట్టాడు. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ అన్వర్ అలీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

విశ్వక్ సేన్ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు డైలాగ్ లు, డ్యాన్స్ లతో అదరగొట్టాడు. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ఇద్దరికీ ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయి. ముఖ్యంగా శ్రద్దా శ్రీనాథ్ రోల్ సర్ ప్రైజింగ్ అని చెప్పవచ్చు. అయితే లుక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాలి. నరేష్, సునీల్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

ఫైనల్ గా..

ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మెప్పించింది. స్క్రిప్ట్ కి, అందునా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కి రిపేర్లు చేస్తే.. అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది. ప్రస్తుతానికైతే విశ్వక్ సేన్ ఎనర్జీ కోసం, సెకండ్ హాఫ్ కోసం ఒకసారి చూసేయొచ్చు.

రేటింగ్: 2.5/5 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here