గత కొంతకాలంగా హిట్ లేక సతమతమవుతున్న నాగచైతన్య తన తాజా చిత్రం తండేల్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 23 నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తండేల్ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ ప్రయోగాత్మక చిత్రంగా తండేల్ రూపొందుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండడంతో ఈ సినిమాతో అతను సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేస్తాడని అభిమానులు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో ఎన్‌సి24 అనే వర్కింగ్ టైటిల్‌తో నాగచైతన్య ఓ మైథలాజికల్ సినిమా చెయ్యబోతున్నాడన్న విషయం తెలిసిందే. చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. తనకు సరైన సక్సెస్ రావాలంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉన్న కథలకే ప్రాధాన్యం ఇవ్వాలని చైతన్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే సాయిధరమ్‌తేజ్‌తో విరూపాక్ష వంటి డిఫరెంట్ మూవీని చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కార్తీక్ దండుతో మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.
విరూపాక్ష చిత్రాన్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ బేనర్స్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. విరూపాక్షకు సంగీతాన్నందించిన అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. ఈరోజు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లోనే తన కొత్త సినిమా కాన్సెప్ట్ ఏమిటి అనేది చెప్పకనే చెప్పారు కార్తీక్ దండు. విరూపాక్ష వంటి ఓ డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఒకేఒక్క కన్నుతో ఉన్న ఈ పోస్టర్‌లో కనుపాపలో ఓ బ్యాగ్ తగిలించుకొని కొండ గుహల్లో ఏదో అన్వేషించేందుకు హీరో వెళ్తున్నట్టుగా ఉంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో విరూపాక్షలా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. సినిమాలో విఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే టాప్ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోకనాథ్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా నటీనటుల వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తారు.