గోపీచంద్‌కి ఒక సాలిడ్‌ హిట్‌ పడక కొన్ని సంవత్సరాలవుతోంది. ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా, ఎంతమంది డైరెక్టర్లు ముందుకొచ్చినా అతన్ని హిట్‌ ట్రాక్‌లోకి తీసుకురాలేకపోతున్నారు. ఇటీవల విడుదలైన విశ్వం కూడా అతన్ని నిరాశపరిచింది. ప్రస్తుతం గోపీచంద్‌ కెరీర్‌ మరీ క్రిటికల్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. తనకు జిల్‌ వంటి హిట్‌ సినిమా ఇచ్చిన రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా అనుకున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయింది. సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను యువి క్రియేషన్స్‌ పక్కన పెట్టేసింది. గోపీచంద్‌, రాధాకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన జిల్‌ చిత్రాన్ని కూడా యువి క్రియేషన్స్‌ సంస్థే నిర్మించింది. ఈ తాజా చిత్రం 70ఎంఎం ప్రొడక్షన్స్‌ సంస్థ చేతికి వెళ్లినట్టు తెలుస్తోంది. 

ప్రభాస్‌కి గోపీచంద్‌ మంచి మిత్రుడు కావడం వల్ల అతని సొంత సంస్థలాంటి యువి క్రియేషన్స్‌ గతంలో జిల్‌ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చెయ్యాలనుకున్నారు. కానీ, సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. అందుకే గోపీచంద్‌ సినిమాను వదులుకుంది. ఇటీవల విడుదలైన కంగువా చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో కలిసి యువి క్రియేషన్స్‌ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇందులో కూడా యువి క్రియేషన్స్‌కి భారీ నష్టం వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాపై చాలా పెట్టుబడి పెట్టి ఉండడం వల్ల మరో సినిమా చేసే అవకాశం లేకుండాపోయింది. 

విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేసినప్పటికీ అది వాయిదా పడింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్‌ వ్యవహారాలకు కూడా బ్రేక్‌ పడింది. అంతకుముందు అఖిల్‌తో కూడా ఒక సినిమా చెయ్యాలనుకున్నారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ సినిమాను కూడా పక్కన పెట్టారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రం బిజినెస్‌ జరిగితేనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. అప్పటివరకు మరో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం లేదు. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి యువి క్రియేషన్స్‌ సంస్థ ఇప్పట్లో కొత్త సినిమా స్టార్ట్‌ చేసే అవకాశం లేదనేది అర్థమవుతోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here