‘పుష్ప-2’ విడుదల కోసం అందరూ ఎంతగా ఎదురుచూస్తున్నారో, ఆ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ కోసం కూడా అదేస్థాయిలో ఎదురుచూశారు. ‘పుష్ప-1’లోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా మావా’ పాన్ ఇండియా వైడ్ గా ఒక ఊపు ఊపింది. ఇక ‘పుష్ప-2’లోని ఐటెం సాంగ్ అంతకుమించి ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అందుకే ‘కిస్సిక్’ సాంగ్ పై అంచనాలు ఓ రేంజ్ కి వెళ్లిపోయాయి. తీరా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం, దీని కోసమా ఇంత హడావుడి చేసింది? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Pushpa 2 The Rule)

‘పుష్ప-2’ నుంచి ‘కిస్సిక్’ అంటూ సాగే సాంగ్ తాజాగా విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ స్పెషల్ సాంగ్ లో.. అల్లు అర్జున్, శ్రీలీల చిందేశారు. అయితే ‘కిస్సిక్’ సాంగ్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది. చాలా మంది అభిమానులు ఈ సాంగ్ పై పెదవి విరుస్తున్నారు. ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. మ్యూజిక్, లిరిక్స్ డిజప్పాయింట్ చేశాయని.. కొరియోగ్రఫీ కూడా తేలిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. యాంటి ఫ్యాన్స్ అయితే అప్పుడే సోషల్ మీడియాలో ‘కిస్సిక్’ సాంగ్ ని ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. (Kissik Song) 

నాణేనికి మరోవైపు అన్నట్టుగా, ‘కిస్సిక్’ సాంగ్ విషయంలో కొందరి అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ సాంగ్ ని సపోర్ట్ చేస్తున్నవారు కూడా బాగానే ఉన్నారు.  ‘ఊ అంటావా మావా’ సాంగ్ విడుదలైనప్పుడు కూడా ఇలాగే బాలేదని అన్నారు. దేవిశ్రీ గత ఐటెం సాంగ్స్ తో పోలిస్తే తేలిపోయిందని కామెంట్స్ చేశారు. కట్ చేస్తే, ‘ఊ అంటావా మావా’ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ‘కిస్సిక్’ సాంగ్ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి వారి అభిప్రాయం నిజమవుతుందో లేదో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here