విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ఓ డిఫరెంట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. అది హీరోనా, సపోర్టింగ్ క్యారెక్టరా అని ఆలోచించకుండా తన క్యారెక్టర్ నచ్చితే ఏది చెయ్యడానికైనా రెడీ అంటారు విజయ్. ఈ ఏడాది జూన్‌లో విజయ్ సేతుపతి 50వ సినిమాగా విడుదలైన ‘మహారాజ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మొదట తమిళ్‌లో, ఆ తర్వాత అన్ని భాషల్లో రిలీజ్ అయి రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ఇటీవల చైనాలో 40,000 స్క్రీన్స్‌లో విడుదలైంది. మొదటిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు రూ.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వీకెండ్స్‌లో కొన్ని రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
తండ్రి, కూతురు సెంటిమెంట్‌తో అద్భుతంగా రూపొందిన మహారాజ చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టే హైలైట్‌గా నిలుస్తోంది. చైనాలోని ప్రేక్షకులు కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అక్కడ రివ్యూలు కూడా ఎంతో పాజిటివ్‌గా వచ్చాయని తెలుస్తోంది. రేటింగ్ కూడా బాగా రావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు చైనాలో ఇండియన్ సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. అందులో దంగల్ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మహారాజ చిత్రాన్ని చైనాలో ఎక్కువ స్క్రీన్స్‌లో రిలీజ్ చెయ్యడంతో కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.