వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఒంట్లో భయం లేకుండా పోతుండడం చర్చకు దారి తీస్తుంది. ఏసీబీ అంటే అసలు భయమే లేకుండా పోతుంది. అవినీతి నిరోధక శాఖ అంటేనే గతంలో హడలిపోయేవారు. ఏసీబీ దాడులు అంటూ ఎప్పుడో ఒకసారి వినిపించేది. కానీ లంచం తీసుకోవడం.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం సాధారణంగా మారిపోయింది. లంచం తీసుకుంటూ పట్టుబడితే కొంతకాలానికి ఉద్యోగం రాకుండా పోతుందా? మళ్లీ ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్న అతి నమ్మకం ఉద్యోగులు అధికారులను లంచావతారులుగా మారుస్తుంది. నిర్మల్ జిల్లాలోని సరిగ్గా ఏడాది తిరగక ముందే ఏడుగురు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కడం పెరుగుతున్న లంచాల ఉద్ధృతికి అద్దం పడుతుంది. సత్వరమే పనులు చేయించుకునేవారు దొడ్డి దారిన లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అలాంటి కేసులు అసలు బయటకు రావడం లేదు. ప్రధానంగా రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి భారీగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిస్థితులను బట్టి చూస్తే అధికారులు ఉద్యోగులకు ఏ స్థాయిలో లంచాలకు మరిగారో అర్థం అవుతున్నది.